Visakhapatnam: పర్యాటకానికి కేంద్ర బిందువుగా విశాఖ

విశాఖలో రుషికొండపై భవనాలు, కొండ కింద తొమ్మిది ఎకరాల భూములు కలిపి పర్యాటక, ఆరోగ్య, ఆతిథ్య గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని పలువురు నిపుణులు, పెట్టుబడిదారులు సూచించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) ఏర్పాటవుతున్న నేపథ్యంలో పర్యాటకానికి కూడా కేంద్ర బిందువుగా తీర్చిదిద్దేందుకు రుషికొండ (Rushikonda)పై భవనాలు అభివృద్ధి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన తరువాత ఇక్కడ పెట్టుబడులు పెట్టే విషయమై నిర్ణయం తీసుకుంటామని ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. రుషికొండపై వైసీపీ (YCP) ప్రభుత్వంలో రూ.452 కోట్లతో నిర్మించిన భవనాలు వినియోగంలోకి తేవడంపై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ విజయవాడలోని కార్యాలయంలో అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ప్రత్యక్షంగా, వర్చువల్‌గా కలిపి ఆతిథ్య రంగానికి చెందిన సంస్థల ప్రతినిధులు 45 మంది పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ఆమ్రపాలి హాజరయ్యారు. రుషికొండ భవనాలపై పర్యాటకాభివృద్ధి సంస్థ ఈడీ పద్మావతి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.