Vizag: విశాఖ మేయర్ పీఠం నీదా..? నాదా..? వైసీపీ క్యాంప్ పాలిటిక్స్ షురూ…!
సాగరతీరం విశాఖలో మేయర్ పీఠం దక్కేదెవరికి? సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని వైసీపీ(YCP) నిలబెట్టుకుంటుందా…? లేదా కూటమి ప్రణాళికతో తన ఖాతాలో వేసుకుంటుందా..? ఇప్పుడీ అంశం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. తాము గెలుస్తామని వైసీపీ చెబుతుంటే.. ప్రశ్నే లేదు.. ఈసారి పీఠం మాదే అంటోంది కూటమి. దీంతో ఇరుపక్షాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వైసీపీ నేతలను..బెంగుళూరు మీదుగా ఊటీకి తరలించి క్యాంప్ పాలిటిక్స్(Camp politics) చేస్తున్నట్లు సమాచారం.
మేయర్ పీఠం చేజిక్కించుకోవడంపై కన్నేసిన కూటమి… మేయర్ హరి వెంకటకుమారికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. దాంతో నగర పాలక సంస్థలో బలపరీక్ష అనివార్యమైంది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే కూటమికి 64 ఓట్లు కావాలి… ప్రస్తుతం ఉన్న బలం దృష్ట్యా మరో నలుగురు కార్పొరేటర్లు కూటమి వైపు వస్తే సరిపోతుంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన వైసీపీ నేతలు.. తమ కార్పొరేటర్లు గట్టుదాటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఇక సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ అధినాయకత్వం ఈ కీలకమైన సమయంలో రంగంలోకి దించింది. ఆయన తన వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇంచార్జి కురసాల కన్నబాబుకు ఇది కీలక సమయమని చెప్పాలి. ఎందుకంటే ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎదురైన మొదటి సమస్య ఇది. నేతలు, కార్పొరేటర్లను సమన్వయపరిచి.. పీఠాన్ని నిలబెట్టుకుంటేనే ఆయనకు రాజకీయంగా ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచ్చు.
అయితే గెలుపు తమదేనని డిప్యూటీ మేయర్ జీఎం శ్రీధర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవతలి పక్షం వైపు వెళ్లిన వారు కూడా మళ్లీ తమ గూటికే రాబోతున్నారని అన్నారు. జగన్, బొత్స, అమర్నాథ్ ల అండదండలతో బలపరీక్షలో తామే నెగ్గబోతున్నామని చెబుతున్నారు. అంతే కాదు.. కూటమి అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఫలితంగా ఈ పరిణామం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి గట్టిదెబ్బగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు.













