Vijayanand : చీఫ్ సెక్రటరీగా విజయానంద్..! చంద్రబాబు సంచలన నిర్ణయం..!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ (AP Chief Secretary Vijayanand) నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ (Nirabh Kumar Prasad) పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో ఈయన స్థానంలో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనే దానిపై దాదాపు నెల రోజులుగా ఉత్కంఠ నెలకొంది. అందరూ సాయిప్రసాద్ (Sai Prasad) చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశం ఉందని భావించారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆ మేరకు సంకేతాలు వచ్చాయి. అయితే సమయం దగ్గర పడుతున్న సమయంలో అనూహ్యంగా విజయానంద్ పేరును ఖరారు చేసింది ప్రభుత్వం. విజయానంద్ ను చీఫ్ సెక్రటరీగా ఎంపిక చేయడంపై కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.
నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో ఈయన తర్వాతి స్థానంలో ఉన్న శ్రీలక్ష్మికి (Srilakshmi) ఆ పదవి దక్కే అవకాశం లేదు. కేసులు, అవినీతి ఆరోపణలు, జగన్ (YS Jagan) అనుకూల అధికారిగా ముద్రపడడం లాంటివి ఇందుకు కారణాలు. ఆ తర్వాత ఉన్న అనంతరామ్ (Anantaram) పరిశీలనలో లేరు. తర్వాత ఉన్నది సాయి ప్రసాద్ (Sai Prasad). అయితే ఆయన్ను కాదని సీనియారిటీ జాబితాలో ఏడో స్థానంలో ఉన్న విజయానంద్ (Vijayanand)ను చీఫ్ సెక్రటరీగా నియమించారు చంద్రబాబు. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విజయానంద్ నియామకం వెనుక కొన్ని విద్యుత్ సంబంధిత సంస్థల హస్తం ఉందనే టాక్ అమరావతిలో జోరుగా వినిపిస్తోంది.
విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా (Energy dept) ఉన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈయన ఇదే శాఖలో పనిచేశారు. ఆ సమయంలో అనేక ఒప్పందాలకు ఈయనే కారణం. ముఖ్యంగా సెకీ నుంచి అదానీ విద్యుత్ (Adani Power) కొనుగోలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇదొక గేమ్ ఛేందర్ అని అప్పట్లో ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ (TDP).. ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఐదేళ్లలో ఏపీపై లక్ష కోట్ల భారం పడుతుందని ఆరోపించింది. తాజాగా ఈ ఒప్పందంపై అమెరికాలో కూడా కేసు నమోదైంది. ఇంత జరిగాక ఎవరైనా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలనుకుంటారు. కానీ విజయానంద్ ను చీఫ్ సెక్రటరీగా కూర్చోబెట్టడంతో ఆ ఛాన్స్ లేదని అర్థమవుతోంది.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ (Shirdi Sai Electricals) చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. స్మార్ట్ మీటర్లన్నీ ఈ సంస్థకు చెందినవే. ఈ సంస్థతో ఒప్పందం వెనుక కీలక పాత్ర పోషించింది కూడా విజయానందే. ఈ సంస్థపై అప్పట్లో టీడీపీ అనేక ఆరోపణలు చేసింది. ఈ సంస్థతో ఒప్పందం ద్వారా ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఆరోపించింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటిపై చర్యలు తీసుకోవట్లేదు. ఇలాంటి వాటన్నింటిలో కీలక పాత్ర పోషించిన విజయానంద్ కు మాత్రం కీలక బాధ్యతలు అప్పగించింది. బీసీ కావడంతో వాళ్ల పట్ల గౌరవంతోనే విజయానంద్ కు ఆ పదవిని కట్టబెట్టినట్లు టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంతేకాక సాయిప్రసాద్ కంటే విజయానంద్ ముందే రిటైర్డ్ అవుతారని.. అందుకే ఆయనకు చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా నాడు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించడంపై మాత్రం కొంతమంది అసంతృప్తితో ఉన్నారు.













