యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి : ఉపరాష్ట్రపతి
మహనీయుల జీవితాలను పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావితరాలకు సమాజహిత సందేశాన్ని అందించవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సమరయోధులను స్మరిచుకుందా పేరిట విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని అల్లూరి సీతారామరాజు స్వగ్రామం పాండ్రంకిని మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుతో కలిసి ఆయన సందర్శించారు. అల్లూరి నివసించిన ఇంటిని సందర్శించడంతో పాటు గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఏ ఒక్క ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదన్నారు. యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని సూచించారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.













