భక్తి సాహిత్యం విశ్వవ్యాప్తం కావాలి – శంకర విజయేంద్ర సరస్వతి స్వామి

తమిళంతోపాటు, తెలుగులో భక్తి సాహిత్యం విశ్వవ్యాప్తం కావాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకు అనుగుణంగా ప్రచారం చేసేందుకు అందరూ ముందుకురావాలని కంచి శ్రీకామకోటి పీఠ జగద్గురువు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కోరారు. తెలుగు భక్తి సాహిత్యాన్ని విశ్వవ్యాప్తంచేయడానికి కృషి జరగాలన్నారు. సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు రచించిన ‘ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు’ పుస్తకాన్ని జూమ్ యాప్ వేదికగా విడుదలచేస్తూ, అయోధ్యలో శ్రీరామచంద్రుని కోసం దివ్య భవ్య మందిరాన్ని నిర్మిస్తున్న సమయంలో ఈ పుస్తకం వెలువడటం ముదావహమన్నారు. హిందూ జీవితంలో రామాయణం ఒక అభిన్నాంగమని, రామాయణ సందేశం, సారాంశం, ధర్మాది విషయాల్లో రామాయణ బోధనలు నిత్యానుసరణీయాలని చెప్పారు. ఆంధ్ర వాల్మీకి వాసుదాస మందారాన్ని విమర్శనాత్మక విశ్లేషణతో కథారూపంలో చెప్పినందుకు రచయిత జ్వాలా నరసింహారావును అభినందించారు. ప్రచురణకర్త దర్శనమ్ శర్మను ఆశీర్వదించారు.
ఆంధ్ర వాల్మీకి మందారాన్ని వివరించడానికి కథరూపాన్ని ఎంచుకున్నందుకు జ్వాలా నరసింహారావును ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అభినందించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వీఎస్‍ఆర్ మూర్తి, ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ చిలకపాటి విజయరాఘవాచార్య, కేంద్ర మాజీ ప్రధాన సమాచార హక్కుల కమినషర్, ప్రముఖ న్యాయనిపుణుడు మాడభూషి శ్రీధర్ తదితరులు మాట్లాడారు.
వనం జ్వాలా నరసింహారావు మాట్లాడుతూ.. రామాయణంపై వచ్చిన ఈ రచనకు విజయరాఘవాచార్య ప్రేరణ ఉన్నదని చెప్పారు. శ్రీ కంచి మఠం శ్రీకార్యం చల్లా విశ్వనాథశాస్త్రి, అమెరికా నుంచి సంస్కృత సోదరులు కొడవటిగంటి శ్రీనాథశర్మ, మహాదేవశర్మ, సీనియర్ జర్నలిస్టు బండారు శ్రీనివాసరావు, ఎస్బీఐ మాజీ ప్రధానాధికారి బండారు రామచంద్రరావు, ప్రముఖ విద్వాంసుడు దత్తాత్రేయశర్మ తదితరులు జ్వాలా నరసింహారావును అభినందించారు.