బడ్జెట్లో అమరావతికి ప్రాధాన్యం : కేంద్ర మంత్రి మురుగన్
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ అనంతరం మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు విజయవాడ వచ్చిన మురుగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2040 లక్ష్యంగా బడ్జెట్ కేటాయించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 8.2 శాతం ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయడంతోపాటు ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేదిశగా బడ్జెట్లో తగిన ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. తాజా బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి రూ.50,474 కోట్లు కేటాయించారన్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చామని, ప్రతిష్ఠాత్మక పూర్వోదయ పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. దీనివల్ల జార్ఖండ్ నుంచి ఆంద్రప్రదేశ్ వరకు ఉన్న తూర్పు తీర ప్రాంతాన్ని దేశానికి గ్రోత్ఇంజిన్గా మారుస్తామన్నారు. ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్రతోపాటు ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి, ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. దేశంలో రొయ్యల ఎగుమతిలో 60 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉందని, బ్రీడిరగ్ సెంటర్ను అభివృద్ధి చేస్తామన్నారు. వ్యవసాయంలో విభిన్న పంటల పెంపకం కోసం పరిశోధనలు చేసేందుకు వీలుగా నిధులు కేటాయిస్తామన్నారు.













