తిరుపతి ఎంపీ సీటుపై కన్నేసిన ఉండవల్లి శ్రీదేవి..!!
ఉండవల్లి శ్రీదేవి.. తాడికొండ ఎమ్మెల్యేగా సుపరిచితురాలు. అధికార వైసీపీలో ఒకప్పుడు బాగా యాక్టివ్ గా ఉన్న శ్రీదేవి ఈ మధ్య పూర్తిగా కనుమరుగైపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆమె అస్సలు బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. వైసీపీలో ఇక వెళ్లే పరిస్థితి లేకపోవడంతో టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఈసారి ఆమె తాడికొండ నుంచి కాకుండా తిరుపతి ఎంపీ సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఆమెకు సీటు ఇస్తారా..?
ఉండవల్లి శ్రీదేవి పేరు తెలియని వారుండరు. రాజధాని అమరావతి ఉన్న తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆమె పేరు మార్మోగింది. అమరావతిని ఓన్ చేసుకున్న టీడీపీ అభ్యర్థిని ఓడించడం ఉండవల్లి శ్రీదేవి ప్రత్యేకత. ఈ ఏరియాలో గెలవడంతో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని శ్రీదేవి ఆశించారు. మంత్రి పదవి కోసం ఆమె చాలా గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఎస్సీ కోటాలో అయినా తనకు కేబినెట్ బెర్త్ దక్కుతుందని భావించారు. కానీ జగన్ మాత్రం ఆమెను పట్టించుకోలేదు. రెండు దఫాలుగా జరిగిన కేబినెట్ విస్తరణలో శ్రీదేవికి ఛాన్స్ దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యారు.
మరోవైపు ఉండవల్లి శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే ఆమెపై రివర్స్ అయ్యారు. దీంతో నియోజకవర్గం చేజారిపోతోందని గ్రహించిన జగన్.. అక్కడ శ్రీదేవిని తప్పించి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను ఇన్ ఛార్జ్ గా నియమించారు. దీన్ని శ్రీదేవి జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి ఆమె పార్టీకి దూరమయ్యారు. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఇందులో ఆమె వైసీపీ అభ్యర్థికి కాకుండా టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. క్రాస్ ఓటింగ్ వేసిన వాళ్లలో శ్రీదేవి కూడా ఉన్నారని వైసీపీ నిర్ధారణకు వచ్చింది. ఆమెను పక్కన పెట్టేసింది. శ్రీదేవి కూడా సైలెంట్ అయిపోయారు.
అయితే ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు శ్రీదేవి ట్రై చేస్తున్నారు. ఎస్సీ కోటాలో తనకు ఎమ్మెల్యే లేదంటే ఎంపీ సీటు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. చంద్రబాబుతో సమావేశంకోసం ఆమె ఏకంగా భర్తను వెంట బెట్టుకుని శ్రీకాకుళం వెళ్లారు. తిరుపతి ఎంపీ సీటు తనకు ఇవ్వాలని ఆమె చంద్రబాబును కోరినట్టు సమాచారం. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపనకు కారణమైన తనకు తప్పకుండా చంద్రబాబు టికెట్ ఇస్తారనే నమ్మకం శ్రీదేవిలో కనిపిస్తోంది. మరి చంద్రబాబు ఆమె టికెట్ ఇస్తారా.. ఇస్తే ఎక్కడ ఇస్తారు.. లాంటివి ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్నలు.













