కెసియార్ కు జగన్ దావత్ ఇవ్వాలన్న ఎంపీ..
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు ముదిరి తారాస్థాయికి చేరిన వైనం విదితమే కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నాయి…ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగింది. రెండు రాష్ట్రాలు …గట్టిగా తమ వాదనలు వినిపించాయి. ఈ చర్చలు అంత ఫలప్రదం కాలేదని సమాచారం. అయితే రాష్ట్రాల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో తాజాగా భాజాపా ఎంపీ టీజీ వెంకటేశ్ ఈ జల వివాదాల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిగులు జలాలను తెలంగాణ వాడుకోవచ్చు కానీ రాయలసీమ వాడుకోకూడదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కెసియార్ మనసు మార్చుకోవాలని అంటూ.. ఒకవేళ జగన్ ఆయన్ను పిలిచి దావత్ ఇస్తే నైనా ఆయన మనసు మారవచ్చునేమో అంటూ చమత్కరించారు.
హూదా రాదు..ప్యాకేజీ తెచ్చుకుందాం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇక జరిగే పని కాదని ఎంపీ స్పష్టం చేశారు. దీని గురించి అనవసర చర్చ మానేసి కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజీనైనా సాధించుకోవాలని అభిప్రాయపడ్డారు. తద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్రలను అభివృద్ధి చేసుకోవడం మంచిదన్నారు. ఇక ప్రభుత్వం ఆశించినట్టు 3 రాజధానులు ఇప్పట్లో తేలే అంశం కాదన్నారు. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉందని ఈ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏపీకి అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. అలాగే మరోవైపు ఏపీ కూడా కేంద్రం తెస్తున్న పలు బిల్లులకు మద్ధతుగా నిలుస్తోందన్నారు. అయినప్పటికీ స్థానికంగా కొందరు నేతలు నోరు జారుతున్నారని ఇది సరైంది కాదన్నారు.













