న్యాయం గెలుస్తుంది.. చట్టాన్ని గౌరవిద్దాం
ఉద్రిక్త పరిస్థితుల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును నంద్యాల నుంచి విజయవాడ తీసుకొచ్చారు. ఈ క్రమంలో దారి పొడవునా టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. దీంతో కాజ టోల్గేట్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ నిలిచిపోయింది. పోలీసులు లాఠీ ఛార్జిని లెక్క చేయకుండా కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ క్రమంలో చంద్రబాబు జోక్యం చేసుకుని కార్యకర్తలకు సర్దిచెప్పారు. సంయమనం పాటించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. న్యాయం గెలుస్తుంది, చట్టాన్ని గౌరవిద్దామని కార్యకర్తలను కోరారు. చంద్రబాబు విజ్ఞప్తి చేయడంతో కార్యకర్తలు వెనక్కి తగ్గారు. దీంతో వాహన శ్రేణి ముందుకు కదిలింది. గుంటూరు నుంచి వేలాది మంది టీడీపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలు, కార్లలో చంద్రబాబు కాన్వాయ్‌ను అనుసరిస్తున్నారు.













