ఏపీ అసెంబ్లీ…టీడీపీ సభ్యుల సప్పెన్షన్
ఆంధప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజూ తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని అధికారపక్షం స్పీకర్ దృష్టికి తీసుకెళ్లింది. చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కావాల్సినంత సమయం ఇచ్చినా ఉద్దేశపూర్వంగానే టీడీపీ సభ్యులు పోడియం వద్ద ఆందోళన చేపడుతున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 9 మంది ప్రతిపక్ష సభ్యులను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. దీంతో టీడీపీ సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోల బాలవీరాంజనేయ స్వామి, వేగుళ్ల జోగేశ్వరరావు, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, ఏలూరి సాంబిశివరావు, అనగాని సత్యప్రసాద్‌లను సభను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.













