జగనాసుర రక్తచరిత్ర పుస్తకాన్ని విడుదల చేసిన టీడీపీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్‌లోనే పథక రచన జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. సీబీఐ విచారణలో వేళ్లన్నీ సీఎం దంపతులపైనే చూపిస్తున్నందున ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. వివేకా హత్య జరిగిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై జగనాసుర రక్తచరిత్ర పేరిట రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యనేతలు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమ తదితరులతో కలిసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. వివేకా హత్యకేసులో పాత్రధారులు, సూత్రదారులు ఎవరనే దానిపై వివరాలను పేర్కొంటూ పుస్తకాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వివేకా హత్యపై దుష్ప్రచారంతో 2019 ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ లబ్ది పొందారు. వివేకాను టీడీపీ అధినేత చంద్రబాబే హత్య చేయించారని ఎన్నికల సమయంలో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. వివేకాది హత్య కాదని గుండెపోటని చెప్పి, అవినాష్‌రెడ్డి, భాస్కర్ రెడ్డి కలిసి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేకుండా చేశారు. ఎన్నికల ఆఫిడవిట్లో అవినాష్ రెడ్డి ఆదాయం 18 కోట్లుగా ఉంది. మరి వివేకా హత్యకు సుఫారీగా రూ.40 కోట్లు ఇచ్చారంటే ఎవరిచ్చారో తెలియాలి కదా? ఇంత జరుగుతున్నా సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదు? ఈ కేసులోని అంశాలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తాం అని తెలిపారు.













