ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోత్సాహంతో నాటుసారా తయారవుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. శాసనమండలి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. ఈ ఘటనపై బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, జ్యూడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిపై సభాహక్కుల నోటీస్ ఇచ్చామని, సీఎం ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. మంత్రి కొందరు కల్తీ సారా తాగి చనిపోయారని అంటున్నారని, ముఖ్యమంత్రి సహజ మరనాలు అంటున్నారని ఇందులో ఏది నిజం అని నిలదీశారు.
సహజ మరణాలు అయితే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ మృతులకు కోటీ ఇచ్చారు. ఇప్పుడు కనీసం సీఎం పరామర్శించలేదని విమర్శించారు. ఎంతమంది చనిపోతే స్పందిస్తారని ప్రశ్నించారు. మేము సీరియస్గా ఆందోళన చేస్తుంటే, మంత్రులు సభలో జోకులు వేసుకుని నవ్వుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.













