15 శాతం అమలు చేసి… 85 శాతం ఎగ్గొట్టారు
నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్ష కోట్ల అప్పులు చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ రెడ్డి హామీల అమలులో 85 శాతం ఫెయిల్ పుస్తకాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 99 శాతం హామీలు అమలు చేశామని సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారు. 730 హామీలు ఇచ్చి 109 మాత్రమే అమలు చేశారు. 15 శాతం హామీలు అమలు చేసి 85 శాతం ఎగ్గొట్టారు. రూ.2.40 లక్షల కోట్లు పేదవాళ్ల కోసం ఖర్చు పెట్టామంటున్నారు. మిగతా డబ్బు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? ఒక్క ఎకరాకైనా నీరు ఇచ్చారా? పోలవరం ప్రాజెక్టును 74 శాతం పూర్తి చేసి ఇస్తే, గోదావరిలో ముంచేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఒక్కపైసా అయినా ఖర్చు పెట్టారా? అని ప్రశ్నించారు.













