కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తా : చంద్రబాబు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై అండర్ పాస్తో కూడిన ఫ్లైఓవర్ నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అండర్ పాస్ లేకపోవడం వల్ల స్థానిక గ్రామాల రైతులకు, విద్యార్థులకు కలుగుతున్న ఇబ్బందులను అందులో వివరించారు. ఈ నెల 4వ తేదీన హనుమాన్ జంక్షన్లో జరిగిన రైతు సదస్సులో చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామస్థుల తరపున చంద్రబాబుకు జర్నలిస్టులు విన్నవించారు. సమీప గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు తాను కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని సభావేదికపై హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశాను. నందిగామ మండలం మునగచర్ల వద్ద అండర్ పాస్ నిర్మాణంపైనా మరో లేఖ రాశారు. స్థానిక ప్రజల విన్నపం మేరకు ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరారు.













