నేను ప్రాజెక్టులపై మాట్లాడుతుంటే… ఆయన బ్రో గురించి
నేను ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే ఆ శాఖ మంత్రి అంబటి బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గండికోట రిజర్వాయర్ను చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని సీఎం జగన్ కొత్త ప్రాజెక్టుల పేరుతో మరో దోపిడీకి తెరలేపారని ధ్వజమెత్తారు. కొత్తగా 10 ప్రాజెక్టులంటూ రూ.12 వేల కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తూనే, మంత్రి పెద్దిరెడ్డికి మాత్రం రూ.600 కోట్ల బిల్లులను సెటిల్ చేశారు. ఏ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవరికి పేరు వస్తుందోనని పెండింగ్ ప్రాజెక్టులను వదిలేశారు. ఉన్న ప్రాజెక్టులు రద్దు చేసి 23 ప్రాజెక్టులతో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో జగన్ డ్రామాలాడుతున్నారు. నాలుగేళ్లలో ఒక్కటీ పూర్తి చేయలేదు. నెలకోసారి ఢిల్లీ వెళ్లే జగన్, ఈ ప్రాజెక్టులపై కేఆర్ఎంబీ, ఎన్జీటీ, సీడబ్ల్యూసీ నుంచి ఎలాంటి అనుమతులు తేలేకపోయారు.
సొంత కంపెనీలకు డబ్బులు దోచిపెట్టేందుకు మంత్రులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. ఆగస్టు 2వ తేదీ వచ్చినా శ్రీశైలం మోటార్లు ఇంకా ఆన్ కాలేదు. పోలవరం పూర్తి చేసి ఆ నీటిని బనకచర్లకు తెచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. పోలవరం పనులకు నాడు గిన్నిస్ రికార్డులు చేస్తే, నేడు అన్నీ విమర్శలే. పోలవరం నిర్వాసితులు వరద ముంపునేకు గురైతే కనీసం తిండి కూడా పెట్టట్లేదు. వారు వలసపోయే దుస్థితి వచ్చింది. అధికారంలోకి రాగానే పోలవరం ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించి నిర్వాసితులను ఆదుకుంటాం అని స్పష్టం చేశారు.













