టీటీడీ జంబో బోర్డును రద్దు చేయాలి : చంద్రబాబు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠను దెబ్బతీస్తే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. టీటీడీకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భక్తుల బనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆయన లేఖ రాశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన టీటీడీకి ముందెన్నడూ లేని విధంగా 81 మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం గర్హణీయమన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇంత మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయలేదన్నారు. భక్తుల మనోభావాలకు భిన్నంగా ఏర్పాటు చేసిన జంబో బోర్డును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ సంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
వ్యాపార ధోరణి, రాజకీయ ప్రయోజనాలతో దీన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక చింతనకు, సనాతన హైందవ ధర్మానికి ప్రతీక అని, అలాంటి పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరమన్నారు. భక్తి భావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన టీటీడీ బోర్డులో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్థులు, కళంకితులకు చోటు కల్పించారని, దీని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు.













