అందరూ కుమ్మక్కై ఎన్నికను ప్రహసనంలా మార్చేశారు : చంద్రబాబు ఫైర్
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉప ఎన్నిక పోలింగ్‌ను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల సాయంతో మళ్లీ ఎన్నికను నిర్వహించాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఆధారాలన్నింటినీ పరిశీలించి, మిగతా చోట్ల కూడా రీపోలింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా దొంగ ఓట్లు వేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో చంద్రబాబు వర్చువల్‌గా ప్రసంగించారు. వైసీపీ నేతలు తిరుపతి ఉప ఎన్నికకు వందల బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించారని, పోలీసులు సరిహద్దులు మూసివేసి, తనిఖీలు చేసి పంపించాల్సింది పోయి, చెక్‌పోస్టులను ఎత్తేశారని మండిపడ్డారు. అసలు చెక్‌పోస్ట్‌లను ఎందుకు ఎత్తేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చాలా మంది బయటి వ్యక్తులు వచ్చారని, మంత్రి పెద్దిరెడ్డి కన్వెన్షన్ సెంటర్లో భారీ సంఖ్యలో జనాల్ని ఉంచి, వారిని పర్యాటకులు అని అంటున్నారని, దీనిపై పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
బీజేపీ నేత శాంతారెడ్డి దొంగ ఓటర్లను పట్టుకున్నారని పేర్కొన్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు, ఇలా అందరూ కుమ్మక్కై ఎన్నికలను ప్రహసనంగా మార్చేశారని తీవ్ర స్థాయిలో చంద్రబాబు ఆక్షేపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్థానికేతరుడని, ఆయన తిరుపతిలో ఎందుకు ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. పోలీసులు, అధికారులు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలని, అంతేకానీ వైసీపీ కోసం కాదని చురకలంటించారు. తిరుపతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని, బందిపోట్లను తలపించేలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని బాబు మండిపడ్డారు. ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైసీపీ చేసిన అక్రమాలన్నింటినీ తాము రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు.













