పరీక్షలు నిర్వహించే అధికారం ఎవరిచ్చారు? చంద్రబాబు

రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకే జగన్ సర్కార్ మొగ్గు చూపడంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. పది, ఇంటర్ పరీక్షలను నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. ముందుగా నిర్వహించాలని అనుకున్న పరీక్షలను కోరనా కారణంగా దేశమంతటా వాయిదా వేస్తున్నారని, విద్యార్థుల ప్రాణాలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి హామీ ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా సమయంలోనూ 130 మంది ఉపాధ్యాయులు చనిపోవడానికి ప్రభుత్వం కారణమైందని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రాణం ఉంటేనే చదువు కొనసాగుతుందని, ప్రాణాలతో బతికితేనే విద్యార్థుల భవిష్యత్తు దేదీప్యమానంగా వెలుగుతుందని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ పెట్టాలని దేశం మొత్తం చూస్తుంటే ఇక్కడ మాత్రం పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. పరీక్షా కేంద్రాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఏమాత్రం సరిపోదని, రవాణా, ఇతర విధానాలతో విద్యార్థులు కరోనా బారిన పడే ప్రమాద ముందని బాబు హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తున్నారని, రాష్ట్రంలో వితండవాదం, మూర్ఖత్వంతోనే రాష్ట్రాన్ని జగన్ ఈ పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు.
చరిత్రలో ఊహించని సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని, మొదటి దశ కంటే రెండో దశే ఉధృతంగా సాగుతోందన్నారు. పార్టీలకు అతీతంగా, రాజకీయ విమర్శలకు ఎలాంటి తావూ లేకుండా కలిసి కట్టుగా ఎదుర్కోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కరోనా విషయంలో ప్రభుత్వం చెప్పే లెక్కలకు, శ్మశానాల్లో జరిగే అంత్యక్రియలకు అసలు లెక్కే లేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ అసత్యాలతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే వారిపై కేసులు పెడతామని బెదిరించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ఎక్కడా అమలు కావడం లేదని ఎద్దేవా చేశారు. కరోనా తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాలని బాబు ప్రభుత్వానికి సూచించారు. వివిధ దేశాల వైద్య నిపుణుల సహకారంతో కోరనా కట్టడికి తమ వంతు సాయం చేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.