రంగన్న గూడెంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు కృష్ణా జిల్లా కే ఆదర్శం.. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్న గూడెం గ్రామం లో రంగన్న గూడెం రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ(RRDS) ఆధ్వర్యంలో జరిగిన పలు సేవా కార్యక్రమాలలో ఈరోజు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి పాల్గొన్నారు.
ఈ సందర్భం గా ఆయన గ్రామంలో ఆర్.ఆర్.డీ.ఎస్ ఆధ్వర్యం లో నడుస్తున్న నాంది మినరల్ వాటర్ ప్లాంట్ ను సందర్శించి స్మార్ట్ కార్డ్ ద్వారా24 గంటలు త్రాగు నీటి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ కమ్యూనిటీ హాల్ లో గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగా మణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో CIPET భువనేశ్వర్ లో ఆలిండియా 27వ రాంకు సాధించిన మెరిట్ విద్యార్ధి కనకవల్లి సందీప్ కు B.Tech(MET) కోర్స్ మొదటి సెమిస్టర్ ఫీజు నిమిత్తం అర్ అర్ డీ ఎస్ ద్వారా 27 వేల రూపాయలు చెక్కును అందజేశారు. గ్రామంలో ఎం పి యు పి స్కూల్ కు ఆర్ ఆర్ డి ఎస్ ద్వారా గ్రీన్ చాక్ బోర్డును విద్యా కమిటీ చైర్మన్ నత్తా రంజిత్ కుమార్ కు అందజేశారు.
ఆర్ ఆర్ డి ఎస్ కార్యదర్శి గ్రామ ప్రముఖులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ 2006 నుంచి గ్రామంలో ఎన్ఆర్ఐ తుమ్మల రాంబాబు ద్వారా నాంది మినరల్ వాటర్ ప్లాంటు నిర్వహణ, పేద మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ, ఉచిత వైద్య శిబిరం, ఎం పి యు పి స్కూల్ అభివృద్ధి కి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ప్రసంగిస్తూ రంగన్న గూడెం గ్రామంలో గ్రామస్తులు అందరూ ఒకే త్రాటిపై ఉండి ఆర్ ఆర్ డి ఎస్ ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి, పేద విద్యార్థులకు చేయూత అందిస్తూ 20 సంవత్సరాల నుంచి అలుపెరగని సేవా కార్యక్రమాలు చేయడం కృష్ణా జిల్లా కే ఆదర్శమని రంగన్న గూడెం గ్రామాభివృద్ధికి తానా నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న తానా కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా మాట్లాడుతూ రంగన్న గూడెం గ్రామానికి మా చిన్నప్పటి నుంచి విడదీయరాని అనుబంధం అని తన సహ విద్యార్థి కనకవల్లి శేషగిరిరావు కుమారుడు సందీప్ కు 2,3 వ సెమిస్టర్ లకు తాను ఫీజు చెల్లిస్తానని, గ్రామంలోని ఎం పి యు పి స్కూల్ కు 50 వేల రూపాయలు విలువగల పుస్తకాలను లైబ్రరీ రూపం లో తానా సంస్థ నుండి అందజేస్తానని, సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఈ కార్యక్రమం అనంతరం తానా అధ్యక్షులు కమ్యూనిటీ హాల్ లో మొక్కలు నాటి గ్రామ సచివాలయం, గ్రామ పాలకేంద్రం, నిర్మాణంలో ఉన్న శ్రీకృష్ణుని గుడి ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో కాకాని తరుణ్ కుమార్ ఎం పి టి సి సభ్యులు పుసులూరు లక్ష్మి నారాయణ, గ్రామ పాల కేంద్రము అధ్యక్షులు మొవ్వ శ్రీనివాసరావు, ఆర్ ఆర్ డి ఎస్ అధ్యక్షులు తుమ్మల దశరధరామయ్య పంచాయతీ కార్యదర్శి సిహెచ్ ఆంజనేయులు, సచివాలయ కార్యదర్శి ఏ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.













