ఏపీ తేదేపా పార్టీ ఆఫీసుపై సుప్రీం నోటీసులు..
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకుంటున్న పార్టీ ప్రధాన కార్యాలయానికి భూకేటాయింపుల విషయంలో సీఆర్డీయే నిబంధనల ఉల్లంఘన జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపిస్తున్నారు. ఆయన ఇదే అంశంపై కొన్ని రోజుల క్రితం రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ పట్టు వీడని ఆర్కే…తనకు హైకోర్టులో న్యాయం జరగలేదని అంటూ మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో టీడీపీ జాతీయ కార్యాలయం నిర్మించారు. అయితే ఈ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, దాదాపు 3.65 ఎకరాల వాగు భూమిని కబ్జా చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిర్మాణం జరిపారని ఆర్కే తన పిటిషన్లో ఆరోపించారు. ఆయన పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఏపీ సర్కారుకు, తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. అప్పటివరకు విచారణ వాయిదా వేసింది. ఎమ్మెల్యే ఆర్కే తరఫున ప్రశాంత్ భూషణ్, రమేశ్ వాదనలు వినిపించారు. జల వనరులతో సంబంధం ఉన్న భూమిని పార్టీ ఆఫీసుకు కేటాయించారని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది.













