మూడేళ్లుగా ఇదే విషయాన్ని చెబుతున్నారు
ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు భవనాలు ఎప్పుడు పూర్తి అవుతాయని సుప్రీం ప్రశ్నించగా, డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున న్యాయవాది నారీమన్ కోర్టుకు తెలిపారు. మూడేళ్లుగా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారని, ఆలస్యానికి కారణాలేంటని కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఉన్నతన్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే తగిన నిధులు లేకపోవడం వల్లే హైకోర్టు భవన నిర్మాణం ఆలస్యమైందని నారీమన్ తెలిపారు. కాగా ఏపీకి కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చిందని, అందులో హైకోర్టుకు కూడా కొన్ని నిధులు కేటాయించినట్లు కేంద్రం తరపు న్యాయవాదులు తెలియజేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నామని, డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది నారీమన్ తెలియజేశారు. దీనిపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.













