చంద్రబాబు రోడ్‌షోపై రాళ్ల దాడి.. సెక్యూరిటీ అధికారికి గాయాలు
నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోపై రాళ్ల దాడి జరగడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. చంద్రబాబు కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయి విసిరడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు గాయాలు అయ్యాయి. ఈ దాడి జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దాడికి ఎవరు పాల్పడింది తెలియరాలేదు. ఈ క్రమంలో పోలీసుల భద్రతా వైఫల్యంపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ రౌడీలకు తాను భయపడటం జరగదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు చంద్రబాబు రోడ్‌షో సమయంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. రోడ్‌షో తొందరగా ముగించాలని టీడీపీ నేతలపై పోలీసుల ఒత్తిడి చేయడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రోడ్‌షోకు భారీగా హాజరైన ప్రజలను నియంత్రించేందుకు అదనపు పోలీస్ బలగాలు రంగంలోకి దిగి.. చంద్రబాబు వాహనానికి ముందు, వెనుకా పెద్దఎత్తున రోప్ పార్టీలు ఏర్పాటు చేశాయి. అయినా ఈ ఘటన జరగడం భద్రతా వైఫల్యమేనని చంద్రబాబు పేర్కొన్నారు.













