YSRCP: వైసీపీకి పదిహేనేళ్లు.. భవిష్యత్ ఎలా ఉండనుంది..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) 15వ వార్షికోత్సవం (YCP Anniversary) జరుపుకుంటోంది. 2011 మార్చి 12న ఇడుపులపాయలో (Idupulapaya) వైఎస్సార్ సమాధి సాక్షిగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆవిర్భవించింది. అప్పుటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీగా ఉంది. వైసీపీ దెబ్బకు కాంగ్రెస్ (Congress) తుడిచిపెట్టుకుపోయింది. టీడీపీ తట్టుకుని నిలబడగలిగింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలే ఏపీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వైసీపీ ఇప్పటివరకూ అధికార హోదా చూసింది.. ప్రతిపక్షంలోనూ ఉండింది. అయితే ఇప్పుడు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కని స్థాయికి పడిపోయింది. దీంతో ఆ పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది.
2014 నుంచి 2019 వరకూ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. జగన్ (YS Jagan) పాదయాత్ర ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. పైగా ఒక్క ఛాన్స్ అని కోరడంతో 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు జగన్ కు కనీవినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమానికి పెద్దపీట వేశారు. అవే తమను గెలిపిస్తాయని నమ్మారు. విలువలు, విశ్వసనీయత అనే మాటలకు పేటెంట్ తమదేనని చెప్పుకొచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. దీంతో ప్రతిపక్ష హోదా (Opposition Status) కూడా రాకుండా పోయింది.
వైసీపీకి ఎందుకింతటి పరాజయం ఎదురైందనే దానిపై జగన్ సమీక్ష చేసుకోవాల్సి ఉంది. కానీ ఆయన అలా చేయకుండా ఇప్పటికీ చంద్రబాబు అబద్దపు హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని చెప్తున్నారు. తాను పలావ్ పెడ్తే బిర్యానీ కోసం ఓట్లేశారని ఎద్దేవా చేస్తున్నారు. తన పాలనే భేష్ అని చంకలు గుద్దుకుంటున్నారు. ఇంత చేసినా తమను జనం ఎందుకు ఇంతలా ఓడించారని మాత్రం జగన్ ఆలోచించుకోవట్లేదు. దీంతో జగన్ ఇక మారరని.. ఆయన అంతేనని.. సొంత పార్టీ నేతలే దెప్పిపొడుస్తున్నారు.
మరోవైపు పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. అందరి వేళ్లూ జగన్ వైపే వేలెత్తిచూపుతున్నాయి. విజయసాయి రెడ్డి లాంటి నేతలు కూడా కోటరీ వల్లే జగనే ఓడారని కుండబద్దలు కొట్టారు. మరోవైపు తల్లి, చెల్లి కూడా జగన్ పై సమరభేరి మోగించారు. జగన్ కూడా ఇలాంటి వాటివల్ల తన పరువు, కుటుంబ ప్రతిష్ట మంటగలుస్తోందనే విషయాన్ని గ్రహించకుండా వాళ్లపై పోరాటానికే సిద్ధమయ్యారు. ఇలా అన్ని వైపులూ జగన్ వైపు బాణాలు ఎక్కుపెట్టాయి. మరోవైపు కేంద్రంలో, రాష్ట్రంలోని ఏ ఇతర పార్టీలూ జగన్ కు అండగా నిలిచే పరిస్థితి లేదు. ఈలోపు పాత కేసులు తిరగదోడి జైలుకు పంపించాలని భావిస్తున్నాయి. అదే జరిగితే పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది. మరి ఇన్ని సవాళ్లను జగన్ ఎదుర్కొంటారోననే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఇలాంటి సవాళ్లు జగన్ కు కొత్తకాదు. తండ్రి చనిపోయినా.. ఒంటరిగా పార్టీని అధికారానికి చేరువ చేశారు. మరి ఇప్పుడు ఎలాంటి ఎత్తులు వేస్తారో చూడాల్సి ఉంది.













