Pithapuram Varma: వన్ ప్లస్ వన్ గన్‌మెన్ సెక్యూరిటీతో కాంట్రవర్సీ గా మారిన వర్మ వ్యవహారం..

పిఠాపురం (Pithapuram) మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ( Varma) పేరు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వర్మకు నిజంగానే ప్రాణహాని ఉందా? ఉంటే అది ఎవరినుంచోన్న అనుమానం వేస్తోంది. ఆయన త(TDP)కి సీనియర్ నాయకుడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి. పార్టీ బలపడటానికి చాలా కృషి చేశారు. అన్ని వర్గాల మద్దతు పొందిన వర్మ, అజాతశత్రువు అనే పేరును కూడా సంపాదించుకున్నారు. అలాంటి ఆయనకు అకస్మాత్తుగా ముప్పు ఉందని వినిపించడం రాజకీయ చర్చలకు దారి తీస్తోంది.
ఇటీవల వర్మ ప్రభుత్వానికి లేఖ రాసి, తనకు వ్యక్తిగత భద్రత అవసరమని కోరినట్లు సమాచారం. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వన్ ప్లస్ వన్ గన్‌మెన్‌ను కేటాయించింది. దీంతో వర్మ భద్రత బలపడింది. అయితే దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్మకు రాజకీయ ప్రత్యర్థులు తప్ప వేరే శత్రువులు లేరని, నేరుగా ముప్పు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని కొందరు వాదిస్తున్నారు.
ఇక ఇంటెలిజెన్స్ విభాగం (Intelligence Department) వర్మకు పెద్దగా ముప్పు ఏమీ లేదని అభిప్రాయపడుతోందని అంటున్నారు. వారి దృష్టిలో ఆయనకు గన్‌మెన్ అవసరం లేదన్న వాదనకు ఆధారాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఎలాంటి నివేదికలు లేని సమయంలోనే ప్రభుత్వం భద్రత కల్పించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం రాజకీయంగా కూడా వివాదానికి దారితీస్తోంది.
వర్మకు భద్రత కేటాయింపు వెనుక రాజకీయ కోణం ఉందా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు ముందుకు వచ్చింది. ఆయన ఎమ్మెల్సీ (MLC) పదవిని ఆశించినా అది సాధ్యం కాలేదని ఆయన అనుచరులు భావిస్తున్నారు. అలాగే నామినేటెడ్ పదవి కూడా రాలేదన్న నిరాశ ఉంది. మరొక వైపు పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం జనసేన (Janasena) అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆధీనంలో ఉంది. అయినప్పటికీ టీడీపీ శక్తిని నిలబెట్టేందుకు వర్మ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. కూటమిలోని విభేదాలు బయటకు రావడం సహజమే కానీ అవి వ్యక్తిగత శత్రుత్వంగా మారలేదని చాలామంది స్పష్టం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వర్మకు గన్‌మెన్ కేటాయించడంపై విభిన్న అభిప్రాయాలు రావడం సహజమే. ఒకవైపు ఆయన విజ్ఞప్తిని ప్రభుత్వం గౌరవించిందని అంటుంటే, మరోవైపు ఇంటెలిజెన్స్ నివేదికలను పక్కన పెట్టి భద్రత కల్పించారా అన్న ప్రశ్నలు లేవుతున్నాయి. ఏది ఏమైనా, ఇకపై వర్మ గారు గన్‌మెన్‌లతో ప్రజల్లో కనిపించడం ఖాయం. రాజకీయంగా ఆయన స్థాయికి ఇది కొత్త రకమైన గుర్తింపుగా మారుతుందా అన్నదానిపై కూడా చర్చ మొదలైంది.