కుప్పం కోసం నేరుగా రంగంలోకి దిగుతున్న సీఎం జగన్!
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట అని తెలిసిన విషయమే. మూడు దశాబ్దాల నుంచి అక్కడ చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకూ టీడీపీ ఓడిపోని నియోజకవర్గం కుప్పం. ఇలాంటి నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనుకుంటున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇన్నాళ్లూ పరోక్షంగా పర్యవేక్షించిన సీఎం.. ఇప్పుడు నేరుగా రంగంలోగి దిగబోతున్నారు.
మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో మెజారిటీ స్థానాలు వైసీపీకి దక్కాయి. అప్పటి నుంచి కుప్పంపై వైసీపీ కన్ను పడింది. గట్టిగా కష్టపడితే చంద్రబాబును ఓడించి.. ఇక్కడ కూడా వైసీపీ జెండా ఎగరేయవచ్చని జగన్ అంచనాకు వచ్చారు. అప్పటి నుంచి కేడర్ మొత్తాన్ని కుప్పంలో మోహరించి నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపునకు కృషి చేసిన పార్టీ ఇన్ ఛార్జ్ భరత్ కు ఎమ్మెల్సీ ఇచ్చారు సీఎం జగన్. ఇప్పుడు భరత్ కుప్పంలో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై భరతే పోటీ చేస్తారని ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. దీంతో భరత్ నియోజకవర్గం మొత్తం విపరీతంగా తిరుగుతున్నారు.
గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచామని.. ఈసారి ఎన్నికల్లో 175కు 175 సీట్లూ గెలవాలని సీఎం జగన్ పార్టీ కేడర్ కు టార్గెట్ పెట్టారు. అంటే గతంలో ఎన్నడూ కుప్పం నుంచి ఓడిపోని చంద్రబాబును కూడా ఓడించాలనేది జగన్ ప్లాన్. అదేమంత పెద్ద విషయం కాదని.. కచ్చితంగా చంద్రబాబును కూడా ఈసారి ఓడించబోతున్నామని పార్టీ అంతర్గత సమావేశాల్లో జగన్ పదేపదే చెప్తున్నారు. ఇది పార్టీ కేడర్ లో జోష్ నింపుతోంది. ఇప్పుడు సీఎం జగన్ నేరుగా కుప్పంలో పర్యటించి కేడర్ లో మరింత ఉత్సాహం నింపేందుకు సిద్ధమవుతున్నారు.
ఈనెల 22వ తేదీన సీఎం జగన్ కుప్పంలో పర్యటించబోతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ తొలిసారి కుప్పం వెళ్తున్నారు. సుమారు రూ.66 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. కుప్పంలో అభివృద్ధికి అవసరమైన ఈ నిధులను ఇప్పటికే మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ పనులు పూర్తి చేసి కుప్పం ప్రజల మనసులు గెలుచుకోవాలని వైసీపీ ప్లాన్. మరోవైపు జగనే నేరుగా రంగంలోకి దిగడం ద్వారా పార్టీ కేడర్లో మరింత జోష్ వస్తుందని భావిస్తున్నారు పార్టీ పెద్దలు. ఇప్పటికే కుప్పం క్షేత్రస్థాయి లీడర్లు 60 మందిని జగన్ తాడేపల్లి పిలిపించుకుని చర్చించారు. పార్టీ పరిస్థితిని ఆరా తీశారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం.. చేపట్టాల్సిన కార్యక్రమాలు.. లాంటి వాటిపై దిశానిర్దేశం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని వైసీపీ నమ్ముతోంది. ఇదే విషయాన్ని జగన్ కూడా కేడర్ కు చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో!













