ఓట్లు అడగాడిని వెళ్తే జనం తంతారు.. అధికారులపై స్పీకర్ తమ్మినేని సీరియస్
శ్రీకాకుళంలోని ప్రభుత్వ అధికారులపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం మండిపడ్డారు. పనులు చేయకుండా ఎన్నికల్లో ఓట్లు అడిగితే ప్రజలు తంతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశంలో సీతారం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ ఈ కామెంట్స్ చేశారు. జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు విజయ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు జడ్పీటీసీ సభ్యులు తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల అసలు అభివృద్ధే జరగడంలేదని సభాపతి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహించిన శాసనసభాపతి ..‘జల్జీవన్ మిషన్ పనుల్లో భాగంగా గ్రామాల్లో కుళాయిలు, పైపులైన్లు వేసి నీటి సరఫరా చేయాలి. కానీ ఆ పనులు ఏమాత్రం జరగడం లేదు. ఇలాగైతే రేపు ఎన్నికల సమయంలో ఓట్లు అడగటానికి ప్రజల్లోకి ఎలా వెళ్తాం? పనులు మధ్యలో ఆగిపోయి.. పూర్తిచేయకుండా ఓట్లు అడగడానికి వెళ్తే జనం మమ్మల్ని తంతారు. వాటిని టైంకి పూర్తి చేయండి’ అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.













