కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్ను లారీ డీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గోపవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ గ్రామం నుంచి దాదాపు 25మంది మంగళవారం ట్రాక్టర్లో వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దైవదర్శనానికి వెళ్లారు. రాత్రి ఆలయంలోనే బస చేశారు. బుధవారం ఉదయం మొక్కులు ముగించుకొని ఇంటికి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.













