Chandrababu : ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఫాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష
రక్షణ, అంతరిక్ష రంగంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు సాధించేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ (Aerospace and Defense Policy) ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0పై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నూతనంగా తీసుకొచ్చే పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రచించాలని ఆదేశించారు. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత, నవీన ఆవిష్కరణల కు రాష్ట్రం కేంద్రబిందువుగా మారేలా ప్రయత్నించాలన్నారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor )లో భారత దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింద ని, రానున్న రోజుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ తరహా సాంకేతికతను రక్షణపరంగా వాడుకోవడంతో పాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి, దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చి దిద్దాలని సూచించారు. ఏరోస్పేస్, అండ్ డిఫెన్స్ సలహాదారు సతీశ్‌రెడ్డి (Satish Reddy) వీడియో కాన్ఫరెన్స్ (Video conference) ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు.













