టీడీపీ గూటికీ శైలజానాథ్ ?
ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శైలజానాథ్ టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా శైలజానాథ్ టీడీపీలో చేరుతున్నార్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్ఠానం కూడా ఆ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తున్న తరుణంలో ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఆయనతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది టీడీపీ లో చేరాలని శైలజానాథ్‌కు జేసీ ఆహ్వానం పలికినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జేసీ దివవాకర్ రెడ్డి శింగనమల వెళ్లి శైలజానాథ్‌తో భేటీ అయినట్లుగా సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగాలని జేసి ఆయన్ను ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఈ భేటీపై జేసీ దివాకర్ రెడ్డి గానీ, శైలజానాథ్ కానీ ఎవరూ స్పందించలేదు. శింగనమల నుంచి గతంలో రెండు సార్లు గెలిచిన శైలజానాథ్ మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం శింగనమలలో టీడీపీ గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా ఇంకా ఇంచార్జిని కూడా నియమించలేదు. బలమైన అభ్యర్థి ఉండాలని, తాము సూచించిన వారికే టిక్కెట్ ఇవ్వాలని జేసీ బ్రదర్స్ పట్టుబడుతున్నారు. దీంతో టీడీపీ హై కమాండ్ అక్కడ అభ్యర్థిత్వం ఎవరికి అన్నది ఖరారు చేయలేదు. ఈ క్రమంలో జేసీ, శైలజానాథ్లో చర్చలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది.













