ఎన్టీఆర్ స్మారక నాణెం…
తెలుగుజాతి ఖ్యాతి ఖండాంతరాలు దాటించిన మహా జ్యోతి, నాయకుడు ఎన్టీఆర్. సినీనటుడిగా, ఉమ్మడి రాష్ట్ర సీఎంగా తెలుగు ప్రజలకు సేవలందించారు ఎన్టీఆర్. అలాంటి మహానీయుడికి.. మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా వందరూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. రాష్ట్రపతి ముర్ము చేతులమీదుగా ఈకార్యక్రమం జరిగింది. ఓతెలుగు నేతకు దక్కిన అపురూప గౌరవంగా దీన్ని చెప్పొచ్చు.
ఎన్టీఆర్ ముఖచిత్రంతో కాయిన్ విడుదలచేయడంపై ఆయన అభిమానులు, అనుచరులే కాదు.. ఆయనను రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకించిన వారు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేేశరాజకీయాల్లో ఎన్టీఆర్ చేసిన సేవను పురస్కరించుకుని.. ఆమహనీయునికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అవార్డు ఎన్టీఆర్ కు ఇవ్వడం ద్వారా.. అవార్డు ఔన్నత్యం మరింత పెరుగుతుందంటున్నారు.
ఇప్పటివరకూ సంస్థలు, ఇతర అంశాలపై కాయిన్స్ ముద్రించడం జరిగింది. కానీ తొలిసారిగా వ్యక్తి ముఖచిత్రంతో కాయిన్ ముద్రించడం ఇదే ప్రథమమని హైదరాబాద్ మింట్ మేనేజర్ తెలిపారు. తొలివిడతలో 12 వేల నాణేలు ముద్రించారు. వీటి ధర 3,500 నుంచి 4,850 రూపాయల వరకూ ఉండనుంది. హైదరాబాద్ లో మూడుచోట్ల వీటిని విక్రయిస్తున్నారు. అయితే డిమాండ్ కు సరిపడా ముద్రణలేదని అధికారులు చెబుతున్నారు.
తెలుగు రాజకీయాల్లో అద్భుతమైన మార్పులు తెచ్చిన గొప్పనేతగా ఎన్టీఆర్ ను చెప్పుకోవచ్చు. నేరుగా సినీరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. పేదల కోసం పరితపించేవారు. దీనిలో భాగంగా జనతావస్త్రాలు, రెండు రుపాయలకు కిలోబియ్యం, మద్యనిషేధం, ఆడపిల్లలకు ఆస్తిలో వాటా సహా కీలక పథకాలు అమలు చేశారు. అన్నింటికన్నా ముఖ్యమైంది రెండురుపాయలకు కిలో బియ్యం పథకం. ఇది ఎంతప్రాచుర్యం పొందిందంటే ఇప్పటికీ…….. ఈస్కీమును చిన్నచిన్న మార్పులతో ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. ఎన్నోపథకాలు మారాయి. కాని .. దీన్ని ముట్టుకునే ధైర్యం ఏప్రభుత్వం చేయలేకపోయాయి.
పార్టీలు వేరయినా ఎన్టీఆర్ అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. ఇప్పుడు అగ్రనేతలుగా చలామణి అవుతున్న కేసీఆర్, చంద్రబాబు, జానారెడ్డి సహా పలువురు నేతలందరూ ఎన్టీఆర్ తో పనిచేసినవారే. నవతరం రాజకీయాన్ని ప్రజలకు పరిచయం చేసింది ఎన్టీఆర్. ఇప్పటికీ ఆ మహనీయుడి పేరు, ఫొటో పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. అందుకే ఆయన వందో పుట్టినరోజు అపురూపంగా నిలిచిపోతుందని అభిమానులు చెబుతున్నారు.













