రాఘవేంద్ర స్వామి సన్నిధిలో రిషి సునాక్ తల్లిదండ్రులు
భారత సంతతి వ్యక్తి, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తల్లిదండ్రులు యశ్వీర్, ఉషా సునాక్ మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. సునాక్ అత్త, అక్షతా మూర్తి తల్లి సుధామూర్తి సైతం వారితో పాటు మఠాన్ని సందర్శించారు. శ్రీమఠం చేరుకున్న వీరికి మఠం అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని వీరు దర్శించుకున్నారు. శ్రీమఠానికి విచ్చేసిన వీరికి పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు శేషవస్త్రం, రాఘవేంద్ర స్వామి చిత్రపటం, ఫలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. జ్ఞాపికను అందజేశారు. రిషి సునాక్ కోసం స్వామివారి ప్రసాదాన్ని పీఠాధిపతి అందించారు.













