మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్
రాజధాని బృహత్ప్రణాళిక, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఆయనతో పాటు రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ అంజనీకుమార్, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్‌కు అనుమతించింది. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, అంజనీకుమార్ హైకోర్టులో పిటిషనర్ వేసుకోగా విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం గతంలో తీర్పును రిజర్వు చేసింది. అయితే తాజాగా వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.













