ఫ్యాన్ నేతల్లో ‘టికెట్’ టెన్షన్..?
తెలంగాణ ఎన్నికల ఫలితాలను గుణపాఠంగా తీసుకున్న వైసీపీ.. 11 నియోజకవర్గ ఇంచార్జ్ లను మార్చేసింది. ఇంకా చాలామంది స్థానాలు మార్పునకు గురి కానున్నాయని వార్తలు రావడం.. పార్టీలో టికెట్లు ఆశిస్తున్న నేతలను కలవరపరుస్తోంది. వైసీపీకీ మరీ ముఖ్యంగా సీఎం జగన్ కు వీరవిధేయులుగా ఉన్నవారు సైతం.. పార్టీ హైకమాండ్ తీరుపై అసంతృప్తికి గురవుతున్నారు. మొన్నటికి మొన్న ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మాారారు. ఇప్పుడు ఆర్కే.. పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో పార్టీలో ఓ రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది.
అయితే.. దీన్ని విపక్ష టీడీపీ అందిపుచ్చుకుంది. పార్టీ నియోజకవర్గ ఇంచార్జిలను మార్చడంపై.. చంద్రబాబు సెటైర్లు వేశారు. 11 మంది నియోజకవర్గ ఇంచార్జులు కాదు కదా.. 151 మందిని మార్చినా వైసీపీ గెలవదన్నారు. ప్రజలు ఎప్పుడెప్పుడు ఈప్రభుత్వాన్ని దించేద్దామా..? అని ఎదురుచూస్తున్నారన్నారు. ఓ నియోజకవర్గంలో చెల్లని కాసు….రాష్ట్రంలో మిగిలిన చోట్ల చెల్లుతుందా అని సెటైర్ వేశారు. ఇది వైసీపీలో ఓటమి భయాన్ని సూచిస్తోందని ఆరోపించారు.
2024లో జరిగే ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలకు …నియంత జగన్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో పార్టీలు వ్యక్తులు కాదు….రాష్ట్రం గెలవాలి అని పిలుపునిచ్చారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుంది….అందుకే అభ్యర్థుల మార్పు చేస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇంత విఫలం అయిన ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు.
చంద్రబాబు, టీడీపీ నేతలకు.. వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు గట్టిగానే కౌంటరిచ్చారు. ప్రజావ్యతిరేకత అధికంగా ఉన్న నియోజక వర్గ ఇంచార్జిలను మార్చడం ద్వారా.. మరింత పక్కాగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్న సంకేతాలను అధినేత జగన్.. శ్రేణులకు పంపిస్తున్నారన్నారు. ఇది టీడీపీకి, ఆపార్టీ నేతలకు భయం కలిగిస్తోందని.. అందుకే తమ అంతర్గత వ్యవహారంపై ఫోకస్ పెట్టారని ఆరోపించారు. అయినా తమ నేత ఆర్కే.. అధినేత జగన్ పై విధేయతతో పార్టీ పదవుల నుంచి తప్పుకుంటే.. టీడీపీకి ఎందుకు బాధగా ఉందని ప్రశ్నిస్తున్నారు.
అయితే.. త్వరలో ఎన్నికలు జరగనున్నాయని.. ఈసమయంలో ఇలాంటి మార్పులు, ఎక్కడ పార్టీలో వాతావరణాన్ని చెడగొడతాయో అన్న భయం వైసీపీ శ్రేణుల్లో అంతర్గతంగా కనిపిస్తోంది. వీరవిధేయులకే టికెట్లు కరువైతే.. ఇక తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన.. నేతల్లో వ్యక్తమవుతోంది. హైకమాండ్ అభయమిస్తున్నా.. ఐప్యాక్ నివేదికలు ఎక్కడ కొంపముంచుతాయో.. ఎక్కడ టికెట్ వచ్చినట్లు వచ్చి చేజారుతుందో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.













