అసెంబ్లీకి రాకపోతే ఎలా.. జగన్ ను ప్రశ్నించిన రఘురామకృష్ణరాజు..
రాజకీయాలలో పర్మనెంట్ గా ఎవరు ఎవరికి శత్రువులుగా ఉండరు.. సందర్భాన్ని బట్టి శత్రువులు మిత్రులవుతారు.. మిత్రులు శత్రువులవుతారు. కానీ ఒక్కసారి బద్ధ శత్రువులు అసెంబ్లీలో కలిస్తే ఎలా ఉంటుందో చెప్పండి.. ఊహించడానికి మంచి సినిమా సీన్ లా ఉన్న ఈ సీన్ సోమవారం ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, జగన్ ఒకరికి ఒకరు తారసపడడమే కాకుండా మాట్లాడడం కూడా ఈరోజు సభలో ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రాలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం అనంతరం ఈ సీన్ సభలో చోటుచేసుకుంది. ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు.. వైసిపి అధినేత.. ప్రతిపక్షం కూడా నోచుకోక 11 సీట్లకు పరిమితమైన కడప ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డిని పలకరించడం అందరికీ ఆసక్తికరంగా మారింది. మాజీ సీఎం వద్దకు వెళ్లిన రఘురామరాజు.. ఆయనతో కాసేపు మాట్లాడారు. ఇంతకీ ఏం మాట్లాడాలో తెలుసా.. జగన్ రోజు అసెంబ్లీకి రావాలని.. ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ జగన్ చేతిలో చేయి వేసి మరీ మాట్లాడారు. దానికి జగన్ ఇకపై అసెంబ్లీకి రెగ్యులర్ గా వస్తాను.. మీరే చూస్తారుగా అని జవాబు కూడా ఇచ్చారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తనను హత్య చేయడానికి ట్రై చేశారు అని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇటీవల కేసు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ ప్రభుత్వం మళ్లించిన ప్రభుత్వ నిధుల గురించి వరుసగా శ్వేత పత్రాలు విడుదలవుతున్నాయి. రోడ్ల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ల వరకు.. పసిపిల్లల అంగన్వాడి దగ్గర నుంచి కాలేజీల వరకు.. పని కట్టుకొని మరి టిడిపి నేతలు జగన్ ప్రభుత్వం చేసిన అవకతవకలు వెలికి తీయడంలో బిజీగా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో జగన్ రెగ్యులర్గా అసెంబ్లీకి వస్తే జరిగే డిబేట్ ఎలా ఉంటుందో అని యావత్ ఆంధ్ర ఉత్కంఠతగా ఎదురుచూస్తోంది. ఇక రఘురామకృష్ణ రాజు కేస్ విషయానికి వస్తే కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేపో మా పోయి వ్యవహారంపై జగన్ విచారించడానికి సిద్ధమవుతున్నారని టాక్.













