తేదేపాతో పొత్తుపై అధిష్టానానిదే నిర్ణయం : పురంథేశ్వరి
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయాన్ని భాజాపా కొట్టి పారేయడం లేదు. రాష్ట్రంలో పలు విషయాలపై ప్రస్తుతం దాదాపుగా ఒకే బాటన నడుస్తున్న భాజాపా, తేదేపా, జనసేన పార్టీలు ఎన్నికల ముందు ఒక్కటిగా ప్రజల ముందుకు వెళ్లే అవకాశం లేకపోలేదని పలువురు విశ్లేషకులు భావిస్తున్న నేపధ్యంలో భాజాపా నేత ఆ పార్టీలో తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పురందేశ్వరి మాటలు అందుకు ఊతమిస్తున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమితులైన సందర్భంగా ఆమె పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రజాస్వామ్యంలో కలిసి వచ్చే పక్షాలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడడం అవసరమన్నారు. అదే సమయంలో తేదేపాతో పొత్తుపై ఇప్పుడేమీ చెప్పలేనని, భవిష్యత్తులో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు. రాజధానిగా అమరావతి ఉండాలనేదే తమ పార్టీ స్టాండ్ అని, అయితే ఈ విషయంలో కేంద్రం పాత్ర పరిమితమేనని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు తీర్పు కీలకంగా మారిందన్నారు. తన కుమారుడు వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడనేది అతని ఇష్టప్రకారం ఉంటుందన్నారు.
భాజాపా జాతీయ కార్యవర్గం ఇదే..
తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. అందులో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నుంచి పురందేశ్వరి స్థానం దక్కించుకోగా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా తెలంగాణకు చెందిన డీకే అరుణ నియమితులయ్యారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ , బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ , బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా తేజస్వి సూర్య లను నియమించారు. ఈ కొత్త కార్యవర్గంలో రాంమాధవ్, మురళీధర్ రావులకు చోటు దక్కలేదు.













