కేంద్రంలో హంగ్ వస్తే ప్రధాని చంద్రబాబు అవుతారా?
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు…ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠను కలిగిస్తోంది. గత ఎన్నికల్లో వచ్చినంత మెజారిటీ ఈసారి బిజెపికి లభించదని భావిస్తున్నారు. దాంతో బిజెపికి జతకట్టేందుకు పార్టీలు రాకపోతే పరిస్థితి ఏమిటనేదానిపై ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది.
ప్రత్యామ్నాయంగా ఉన్న యుపీఏ తరపున ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనే ప్రచారంపై మిత్రపక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమగ్ర కార్యాచరణను రూపొందించుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల కంటే ముందుగానే జాతీయ రాజకీయాలపై దష్టి సారించిన చంద్రబాబు బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో దాదాపు సఫలీకతమ య్యారు. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీలక భూమిక అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో చంద్రబాబు వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి.
ఇప్పటికే అధికార బీజేపీ, ఎన్నికల సంఘం పనితీరుపై దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వారి విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ వస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ జాతి దష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈవిఎంలను టాంపరింగ్ చేయడం ద్వారా బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోందంటూ గళమెత్తారు. ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అవరోధాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించడం ప్రాంతీయ నాయకులను ఆకట్టుకుంది. దీంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కనుసన్నల్లో ఎన్నికల సంఘం పని చేస్తోందని, దీంతో బీజేపీయేతర రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈవిఎంల పనితీరు, ట్యాంపరింగ్ అవకాశాలపై జాతీయస్థాయిలో ఆయన లేవనెత్తిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
ఈవీఎంల ట్యాంపరింగ్‌కు ఉన్న అవకాశాలపై ఎన్నికల సంఘానికి ఆయన సవాలు కూడా విసిరారు. మరోవైపు వీవీ.ప్యాట్ రసీదులను కనీసం 50 శాతం అయినా లెక్కించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీనికి 23 పార్టీల మద్దతును కూడగట్టిన ఆయన సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ను కూడా వేశారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తున్నారన్న భావనను ప్రజల్లోకి బలంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగ సమస్య రెట్టింపు కావడంతోపాటు అభివద్ధి నిలిచిపోయిందని జాతీయస్థాయిలో చంద్రబాబు ధ్వజమెత్తుతున్నారు. మోడీ అనుసరిస్తున్న విధానాలతో దేశం తిరోగమనంలో పయనిస్తోందని ప్రధానంగా వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని విమర్శలు చేస్తూ ముప్పేట దాడికి దిగారు.
మరోవైపు రాష్ట్రాల హక్కులను హరించేలా మోడీ ప్రయత్నిస్తున్నారని దీంతో ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం ఏర్పడిందని తన పర్యటనతో చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న పోరాటానికి ప్రధాన పార్టీలు కాంగ్రెస్, తణమూల్, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మి, నేషనల్ కాన్ఫరెన్స్, డీఎంకే, జేడీఎస్ తదితర పార్టీలు తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలంటే చంద్రబాబు నాయడు తొలుత ఆంధ్రప్రదేశ్‌లో తన పార్టీకి మెజారిటీ పార్లమెంట్ స్థానాలను తెచ్చుకుంటే జాతీయ రాజకీయాల్లో ఆయనదే ప్రధానపాత్ర అవుతుంది. ఇప్పటికే ప్రధాన మంత్రి పదవి రేసులో తణముల్ అధినేత్రి మమతాబెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయవతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో పలువురు జాతీయ నాయకులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధాని పదవికి అర్హులంటూ పేర్కొవడం గమనార్హం. ప్రధానంగా మాజీ ప్రధాని దేవగౌడ, ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్‌లు చంద్రబాబే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి పదవికి సరైన వ్యక్తిగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడానికి అవసరమైన ఎంపి సీట్లు తెచ్చుకోవడంతో పాటు, రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుంటేనే చంద్రబాబు రాజకీయంగా మరింత బలపడతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.













