Pawan vs Prakash Raj: పవన్ పాలిటిక్స్ పై స్పందించిన ప్రకాష్ రాజ్..
తిరుమల లడ్డు (Tirumala Laddu) తయారీలో జరిగిన కల్తీ నేతి వాడకం గురించి కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి దుమారం రేగిందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని.. పరమ పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ ధ్వజమెత్తిన జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) .. ప్రాయశ్చిత్త దీక్ష అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ఆయన సహనటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) తీవ్రంగా స్పందించారు.
ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా(Social media) వేదికగా.. మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రంలో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది కాబట్టి పూర్తిగా దర్యాప్తు జరిపించండి.. దోషులను కనిపెట్టి కఠినంగా శిక్షించండి.. అంతేకానీ ఇలా అనవసరంగా ఆందోళనను పెద్దది చేస్తున్నారు.. ప్రస్తుతానికి దేశంలో ఉన్న మతపరమైన సమస్యలు చాలు.. మీరు కొత్తగా ఉద్రిక్తతను రేపకండి అంటూ పోస్ట్ పెట్టారు. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వెర్సెస్ ప్రకాష్ రాజ్ (Pawan vs Prakash Raj) గా మాటల తూటాలు పేలాయి.
ఇక అప్పటినుంచి సందర్భం దొరికినప్పుడల్లా ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో పవన్ పై ఏదో ఒక వ్యంగ్యాస్త్రం విసురుతూనే ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా ప్రకాష్ రాజ్ ఇదే తీరులో పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.’పవన్ అంటే మీకు ఎందుకు అంత కోపం?’ అంటూ ఎదురైన ప్రశ్నకు ప్రకాష్ రాజ్ ‘ఆయన చేసే రాజకీయాలు కాస్త మూర్ఖత్వంగా ఉంటాయి.. విధ్వంసకర రాజకీయం చేస్తారు అది నాకు నచ్చదు.. నేను చెప్పేది అదే’ అని అన్నారు. అనంతరం మరి ‘పవన్ కళ్యాణ్ లాంటి నేతను ఎన్నుకున్న ప్రజల సంగతి ఏమిటి?’అని ఎదురైనా మరో ప్రశ్నకు స్పందిస్తూ ప్రకాష్ రాజ్..’ప్రజలు అతన్ని ఎన్నుకుంది దీనికోసం కాదు.. ఎన్నికయ్యాక ఆయన గేరు మారిస్తే అడ్డుకునే వారు ఉండాలి కదా?’ అని అన్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలకు పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.













