ఎన్నికల సంఘం కీలక నిర్ణయం .. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రీషెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల పోలింగ్ తేదీ మారుస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 3న నిర్వహించాల్సిన పోలింగ్ 5వ తేదీకి, ఓట్ల లెక్కింపు 5 నుంచి 7వ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1వ తేదీకి, ఓట్ల లెక్కింపు 30 నుంచి 3 కు ఎన్నికల సంఘం ఇటీవల వాయిదా వేసిన విషయం తెలిసిందే. ముందు ప్రకటించిన షెడ్యూల్ (Schedule) ప్రకారం 3వ తేదీన పరిషత్ పోలింగ్ ఉన్నందున ఎన్నికల నిర్వహణ పరంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిషత్ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. స్థానిక ఎన్నికలపై ముందుకెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించిన విషయం తెలిసిందే.








