Amaravati: అమరావతి రీలాంచింగ్.. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఊపిరి..!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (AP Capital Amaravati) నిర్మాణ పనులు మరోసారి ఊపందుకోనున్నాయి. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రూ.65,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ (CRDA), ఇతర విభాగాలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఈ రీలాంచింగ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకుంది అప్పటి టీడీపీ ప్రభుత్వం. 2015లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. అయితే రాజకీయ మార్పులు, విధానపరమైన అడ్డంకుల వల్ల అమరావతి నిర్మాణం అనేక సవాళ్లను ఎదుర్కొంది. 2019-2024 మధ్య వైసీపీ (YCP) ప్రభుత్వం మూడు రాజధానుల విధానాన్ని ప్రతిపాదించడంతో అమరావతి స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో టీడీపీ (TDP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమి అధికారంలోకి రావడంతో అమరావతిని ఏకైక రాజధానిగా పునరుద్ధరించే ప్రక్రియ వేగవంతమైంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అమరావతిని రాష్ట్ర ఆత్మగౌరవంగా, తెలుగు జాతికి స్ఫూర్తిగా అభివర్ణిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి 34,000 ఎకరాల భూమిని అందించిన 29వేల మంది రైతుల త్యాగాలను ఆయన పదేపదే గుర్తు చేస్తున్నారు. ఈ రీలాంచింగ్ కార్యక్రమానికి రైతులను కూడా ఆహ్వానించారు.
ప్రధాని మోదీ (PM Modi) మే 2న మధ్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అమరావతి సచివాలయ హెలిప్యాడ్‌కు 3:25 గంటలకు చేరుకోనున్నారు. సాయంత్రం 4:45 వరకు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రూ.43,000 కోట్ల విలువైన అమరావతి అభివృద్ధి పనులతో పాటు, రూ.3,176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు, రూ.3,680 కోట్ల విలువైన ఇతర హైవే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 250 మీటర్ల ఎత్తైన శాసనసభ భవనం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణాలకు కూడా ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి నారాయణ (Narayana) స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 5-6 లక్షల మంది ప్రజలు ఈ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. సభాస్థలికి చేరుకోవడానికి 11 మార్గాలను గుర్తించారు. ప్రధాని రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 6వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వెలగపూడి, పరిసర ప్రాంతాలు హరిత శోభ సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని (YS Jagan) కూడా ఆహ్వానించారు. అయితే, వైసీపీ నుంచి ఈ ఆహ్వానంపై స్పష్టత రాలేదు. గతంలో అమరావతి నిర్మాణంపై వైసీపీ విమర్శలు, మూడు రాజధానుల విధానం వంటి అంశాలు రాజకీయ వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ కార్యక్రమంలో పాల్గొంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే మూడేళ్లలో 92 కీలక నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, ఐటీ హబ్‌లు, ఇతర అభివృద్ధి కేంద్రాలను ఇక్కడ స్థాపించే ప్రణాళికలున్నాయి. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా వేగవంతమైంది. అమరావతి రీలాంచింగ్ రాష్ట్రానికి కొత్త ఊపిరిని, ఆర్థిక వృద్ధిని, అభివృద్ధి అవకాశాలను తీసుకొస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.