Pithapuram Varma: క్రెడిట్ అంతా లోకేష్ కే అంటున్న వర్మ.. మరి పవన్ మాటేమిటో..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం వర్మ (Pithapuram Varma) ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. ఏ విషయాన్నైనా మాట్లాడినా ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల జనసేనకు (Janasena) తన సొంత నియోజకవర్గాన్ని ఇవ్వబోతున్నారని వచ్చిన వార్తలతో వర్మ అనుచరులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.. ఆ సమయంలో చంద్రబాబు కలవడంతో వర్మకు హామీ లభించింది. అప్పటి నుంచే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు.
పిఠాపురం నియోజకవర్గం లో రాజకీయాలు వర్మ మరియు జనసేన అనుచరుల మధ్య సాగుతూ వొచ్చిన పరిణామాలు ప్రస్తుతం మరో మలుపు తిరిగాయి. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వర్మను ఉద్దేశించారన్న వార్తలతో అక్కడ రాజకీయ వేడి పెరిగింది. వర్మ కూడా ప్యాసివ్‌గా ఉండకుండా, తనదైన శైలిలో తిరిగి స్పందిస్తున్నారు. ఆయన ఇటీవల చేసిన ప్రకటనలలో, కూటమి విజయం వెనక లోకేష్ (Lokesh) పాత్రే ప్రధానమని చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. ఇది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కంటే లోకేష్‌కే క్రెడిట్ ఇస్తున్నట్లుగా ఉందని కొందరు భావిస్తున్నారు.
ఇలాంటి వ్యాఖ్యలతో వర్మ జనసేన అధినాయకత్వానికి పరోక్షంగా సవాలు విసురుతున్నారు కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయనను తక్కువచేయాలన్న ఆలోచన టీడీపీకి (TDP) లేదని తెలుస్తోంది. వర్మ సేవలకు గుర్తింపుగా ఆయనకు భవిష్యత్తులో ఎమ్మెల్సీ సీటు ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. 2027లో ఖాళీ అయ్యే స్థానంలో ఆయనకు అవకాశం కల్పించాలన్న ఆలోచన టీడీపీ వర్గాల్లో ఉందని సమాచారం. అంతేకాకుండా, 2029లో సీట్ల విస్తరణ జరిగితే పిఠాపురం రెండు నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉండగా, కొత్తగా ఏర్పడే నియోజకవర్గాన్ని వర్మకు ఇచ్చే యోచన కూడా ఉందని అంటున్నారు.
వర్మ పిఠాపురంపై ఆశలు పెట్టుకున్నప్పటికీ, అది జనసేనకే కేటాయించబడిన నియోజకవర్గం కావడంతో ఆయనకు మళ్లీ అక్కడ అవకాశం రావడం కష్టమేనని అంటున్నారు. అయినప్పటికీ, ఆయన టీడీపీలో కొనసాగుతూ, లోకేష్‌ను భవిష్యత్తు నేతగా చూస్తూ, ఆయన పట్ల తన అభిమానం వ్యక్తపరుస్తూ రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో కూడా వర్మకు కొంతమంది మద్దతుదారులు ఉన్నట్లు సమాచారం. ఆయనకు అండగా ఉన్న యనమల రామకృష్ణుడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ అయినప్పటికీ, వర్మకు పార్టీ భవిష్యత్తుపై విశ్వాసం ఉంది. వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన అనుచరులు ఖచ్చితంగా చెబుతున్నారు.













