పవన్ దూకుడు..
గోదావరి జిల్లాల్లో ఏపార్టీ గెలిస్తే.. ఆ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుందన్నది రాజకీయ నానుడి. దానికి తోడు బీసీ, కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలున్నాయి. అంటే మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా అందులో ఐదోవంతు ఈ జిల్లాల్లోనే ఉన్నాయి . ఈజిల్లాలో అధికార వైసీపీ గెలవనివ్వనని పవన్ ఘంటాపథంగా చెబుతున్నారు. అంటే ఇక్కడున్న 34 సీట్లపై పవన్ కన్నేశారు. బీసీ, కాపు సామాజిక వర్గ ఓట్లను ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ వారాహియాత్రలో పదునైన ప్రసంగాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లోని కాపుసామాజికవర్గ నేతలే టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. ఒక్కో ఎమ్మెల్యే పేరు పెట్టి మరీ వారి అవినీతి జాతకాలను బయటపెడుతున్నారు. దీంతో ఆయానేతలు సైతం అంతే ఘాటుగా పవన్ కుబదులిస్తున్నారు. నిన్న పేర్నినానిపై సెటైర్లు పేల్చిన పవన్.. ఇప్పుడు కాకినాడ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చంద్ర శేఖర్ రెడ్డిని టార్గెట్ చేశారు. మూడేళ్లలో బియ్యం రవాణా ద్వారా 15వేల కోట్లు గడించారని ఆరోపించారు.
అంతే కాదు… చంద్రశేఖర రెడ్డిని పర్సనల్ గా టార్గెట్ చేశారు. మీతాతను డీటీ నాయక్ తీసుకెళ్లినట్లు.. నీకు బీమ్లానాయక్ ట్రీట్ మెంట్ ఇస్తానంటూ వార్నింగిచ్చారు. గతంలో ఓసారి వదిలేశామని.. ఈసారి అలా కాదు అవినీతి అంతు చూస్తామన్నారు. మీ అవినీతి ప్రభుత్వాన్ని పడగొట్టకుంటే .. నాపేరు పవన్ కల్యాణ్ కాదు.. మాది జనసేన పార్టీ కాదన్నారు. పవన్ ప్రసంగాలకు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరోవైపు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ద్వారపురెడ్డితో పవన్ కు గతంలోనే గట్టి రాజకీయయుద్ధమే జరిగింది. ఎమ్మెల్యే ఇంటి దగ్గర జనసేన నేతలు ఆందోళనకు దిగడం, దానిపై ద్వారపురెడ్డి అనుచరుల దాడులతో .. ఉద్రిక్తవాతావరణం, 144 సెక్షన్ కూడా నడిచింది. మరోసారి గోదావరి జిల్లాకు వచ్చిన పవన్… నేరుగా ద్వారపురెడ్డితో తలపడ్డారని చెప్పొచ్చు. అయితే పవన్ వ్యాఖ్యలతో ద్వారపురెడ్డి అనుచరుల్లోనూ కలకలం రేగుతోంది.
వైసీపీ నేతలు యువతను ఓట్లకోసమే వాడుకుంటున్నారన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. తాను అలా కాదని, ఒక్క ఛాన్సిస్తే, రాష్ట్రాన్ని అవినీతి రహితం చేస్తానంటూ హామీ ఇస్తున్నారు. కాపులకు అన్యాయం జరుగుతుంటే … వైసీపీ కాపు ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదని ఉదాహరణలతో వివరిస్తున్నారు.ఇలాంటి నేతలు కాదు మనకు కావాల్సింది.. మనకు కష్టమొస్తే ముందుండి న్యాయం చేసేవాడై ఉండాలంటూ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా యువఓటర్లను టార్గెట్ చేస్తూ పవన్ ముందుకెళ్తున్నారు.













