హోదా కోసం ఆమరణ దీక్ష : పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. గుంటూరు సమీపంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ తమ పార్టీ దిశ, దశ, కార్యచరణ గురించి ప్రకటించారు. హోదా, రాష్ట్ర విభజన, తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్ర పదజాలంతో దునుమాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్నీ, విపక్షాన్నీ విమర్శించారు. జైట్లీ ప్రకటన మా గుండెలు రగిలేలా చేస్తోంది. సెంటిమెంటుతో హోదా ఇవ్వబోమని, నిధులు రావని మీరు చెప్పారు. ఎలాంటి సెంటిమెంటుతో తెలంగాణ ఇచ్చారు? విపక్షంలో ఉండి మీరు 15 ఏళ్లు హోదా ఇస్తామని చెప్పలేదా? ఆ మాట నుంచి మీరు తప్పుకొన్నారు. మరి భారతదేశ చట్టాలను మేమెందుకు పాటించాలి? చట్టాలన్నీ మాకేనా? మీకు కాదా? అని సూటిగా నిలదీశారు. రాజధాని లేకుండా, అప్రజాస్వామ్య పద్ధతిలో విభజించి, నెట్టివేసినందునే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు, విపక్ష నేత జగన్‌కూ భయాలు ఉండవచ్చునని, తనకు మాత్రం భయం లేదని తెలిపారు. కేంద్రం పాతిక మంది ఎంపీలను నియంత్రించ గలదేమో కానీ ఐదు కోట్ల మంది ఆంధ్రులను నియంత్రించలేదన్నారు. సీబీఐ కేసులకు అవినీతిపరులు, అక్రమార్కులైన నాయకులే భయపడతారు. నా లాంటి వాళ్లకు భయం లేదు. హోదా కోసం వీధుల్లోకి వస్తాం. జాతీయ రహదారులను దిగ్బంధిస్తా. అమరావతిలోనే మొత్తం భారత ఉప ఖండం చూసేలా, మాకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసేలా పోరాడతాం. మా పోరాటాన్ని బుల్లెట్లతో కూడా అడ్డుకోలేరు అని పవన్ గర్జించారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటా. బలి దానం చేను చేస్తాను అని తెలిపారు. టీడీపీ వైసీపీల్లా పార్లమెంటులో డ్రామాలు చేసి వదిలేస్తే నమ్మేందుకు, చెవిలో పూలు పెట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేం. కేంద్రం సమాధానం చెప్పి తీరాల్సిందే అన్నారు. పార్లమెంటులో మాట ఇస్తారు. తప్పుకొంటారు. చట్టాలను తుంగలో తొక్కేస్తారు. దీనిపై బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.













