విరాళాలు అడిగినవాళ్ల వివరాలివ్వండి
జనసేన పార్టీ పేరుతో విరాళాలు అడిగితే అలాంటివారి వివరాల్ని పార్టీ కార్యాలయానికి తెలియజేయలని పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. కొందరు వ్యక్తులు పార్టీ అధికార ప్రతినిధులమని ప్రచారం చేసుకుంటూ జనసేన శ్రేణుల మధ్య గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ విషయంలో శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆయనో లేఖ విడుదల చేశారు. పార్టీ ప్రచార కార్యదర్శి, అధికార ప్రతినిధిని అంటూ మీడియాతో పార్టీ తరపున మాట్లాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కృష్ణా జిల్లాలో అయితే విరాళాలు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసిందన్నారు. తమ పార్టీ పక్షాన చర్చల్లో పాల్గొనేందుకు ఎవర్నీ నియమించలేదని, ఆ వ్యక్తులు చెప్పే మాటలు, వ్యాఖ్యాలతో పార్టీకి సంబంధం లేదన్నారు. పార్టీ నిర్మాణం కోసం కసరత్తు చేస్తున్నామని, అన్ని అర్హతలు ఉన్నవారినే ప్రతినిధులుగా నియమిస్తాని తెలిపారు.













