కింగ్ మేకర్ తానే అనుకుంటున్న పవన్..! ఈసారి పవర్ ఖాయమా..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు జనంలోకి వచ్చారు. వారాహి యాత్రను ప్రారంభించారు. తొలిరోజు పవన్ కల్యాణ్ యాత్ర విజయవంతంగా సాగింది. అభిమానుల హంగామాతో యాత్ర షెడ్యూల్ ప్రకారం సాగకపోయినా జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఇక పవన్ కల్యాణ్ స్పీచ్ కు జనం కేరింతలు కొట్టారు. పవర్ కోసమే పాలిటిక్స్ లోకి వచ్చామని.. ఈసారి దాన్ని వదులుకోబోమని స్పష్టం చేశారు. అంతేకాక.. పాలన చేతకాకపోతే తప్పుకోవాలని.. లేకుంటే తమదైన రోజు వచ్చినప్పుడు కింద కూర్చోబెడతామని హెచ్చరించారు. మొత్తంగా పవన్ కల్యాణ్ తొలిరోజు యాత్ర ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
పవన్ కల్యాణ్ గతంలో ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా తనకు అధికారం ముఖ్యం కాదని, మార్పుకోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు వారాహి యాత్రలో మాత్రం రూటు మార్చారు. అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చామన్న ఆయన.. ఈసారి ఏ అవకాశాన్నీ వదులుకోబమని తేల్చేశారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థినని కుండబద్దలు కొట్టారు. జనసేన ఎవరికోసమే పని చేయదని.. ఈసారి అసెంబ్లీ అడుగు పెట్టబోతున్నామని తేల్చి చెప్పారు. ఎవరు అడ్డుపడతారో చూస్తానంటూ హెచ్చరించారు. దీంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడింది.
ఏపీలో వైసీపీ, టీడీపీ బలమైన పార్టీలు. ఈ రెండు పార్టీల మధ్యే పోరు ఉంటుంది. జనసేనకు ఇప్పటికీ వాటితో పోటీ పడేంత సత్తా లేదు. కానీ వైసీపీని ఓడించాలనే పట్టుదల మాత్రం పవన్ కల్యాణ్ కు బలంగా ఉంది. ఇది జరగాలంటే టీడీపీతో కలిసి వెళ్లాలి. బీజేపీ వస్తే ఓకే.. లేకపోయినా ఆ పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే భావనలో ఉన్నారు. అయితే టీడీపీతో పొత్తు వల్ల తన పార్టీకి నష్టం జరగకూడదనేది పవన్ కల్యాణ్ ఆలోచన. టీడీపీ విదిల్చే పదో పాతిక సీట్లకోసం కాకుండా.. తన సత్తా ఏంటో చూపించి సీట్లు అడగాలనుకుంటున్నారు. ఇందుకు వారాహి యాత్రను అస్త్రంగా ఎంచుకుంటున్నారు పవన్ కల్యాణ్.
గత ఎన్నికల్లో జనసేనకు ఒకే ఒక సీటు వచ్చింది. ఆయన కూడా పవన్ కు హ్యాండిచ్చి జగన్ వైపు వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపాయరు. కానీ ఈసారి అలా కాకూడదనుకుంటున్నారు. బరిగీసి కొట్లాడాలనుకుంటున్నారు. ఇందుకోసం తనదైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాపులే. గత ఎన్నికల్లో కాపులందరూ వైసీపీకి అండగా నిలిచారు. కానీ ఈసారి వాళ్లను పూర్తిస్థాయిలో తనవైపు తిప్పుకోవాలనుకుంటున్నారు పవన్. ఉభయ గోదావరి జిల్లాల్లోనే 15 సీట్లు సాధించాలనేది పవన్ కల్యాణ్ ఆలోచన. మిగిలిన రాష్ట్రమంతో మరో 15-20 సీట్లు సాధించగలిగితే తాను కింగ్ మేకర్ అవుతాననుకుంటున్నారు. అప్పుడు టీడీపీ చెప్పినట్టు తాను ఆడకుండా.. తను చెప్పినట్టు టీడీపీ వింటుందనే భావనకు వచ్చారాయన. మరి ఆయన ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.













