సీఐడీ వివరణ అనుమానాస్పదంగా ఉంది.. పట్టాభి
తాడేపల్లి సిట్ కార్యాలయ ప్రాంగణంలో తగలబెట్టిన కాగితాల గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది. సరిగా ఏడాది క్రితం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కు సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ నారా లోకేశ్ కు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత రెండు రోజులు వరుసగా ఈ విషయంపై విచారణ కూడా జరిపారు .విచారణ అనంతరం లోకేష్ తమ అనుమతులు లేకుండా హెరిటేజ్ కు సంబంధించిన పత్రాలు, నారా బ్రాహ్మణి , భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ వారి దగ్గర ఎలా ఉన్నాయి అని అధికారులను నిలదీశారు. ఇప్పుడు ఓడిపోతాము అన్న భయంతో జగన్ ఆ కాగితాలన్నిటిని తగలబెట్టిస్తున్నాడు అని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన గురించి సీఐడీ వాళ్లు చెప్పే వివరణ పై పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే విషయం పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. టిడిపి జాతీయ అధికారి ప్రతినిధి అయిన కొమ్మారెడ్డి పత్రాల దహనం గురించి సీఐడీ ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉంది అన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చాలి అనే ఉద్దేశంతో సీఐడీ 100 తప్పులు చేస్తోంది అంటూ విమర్శించారు. పేపర్లో జిరాక్స్ మిషన్ లో ఇరుక్కోవడం వల్ల కాగితాలు క్లియర్ గా ప్రింట్ కాలేదు అని చెప్పడం కనీ వినీ ఎరుగని విడ్డూరం అని అన్నారు. ప్రింటర్లో కేవలం హెరిటేజ్ కాగితాలు ఇరుక్కుపోయాయా?.. కేవలం హెరిటేజ్ కాగితాలు జిరాక్స్ తీయాల్సి వచ్చినప్పుడు ఇంకు ఫేడ్ అయిపోయిందా? అని నిలదీశారు. సీఐడీ వివరణ తరువాత అనుమానాలు మరింత బలపడుతున్నాయి అని అన్నారు. టిడిపి నేతలపై పెట్టిన తప్పుడు కేసుల గురించిన ఆధారాలను కూడా కాల్చేస్తున్నారని పట్టాభి ఆరోపించారు.













