ఆ ఒక్కటీ నెరవేర్చలేక పోయా!
మాజీ మంత్రి పరిటాల రవి చనిపోయి 15 ఏళ్లు గడిచినా ఇంకా అభిమానుల గుండెల్లో నిలిచే ఉన్నారని ఆయన భార్య పరిటాల సునీత అన్నారు. పరిటాల రవి 15వ వర్ధంతి సందర్భంగా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలోని ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చి రవికి నివాళులర్పించారు. అభిమానులు, కార్యకర్తల కోసం అన్నదానం చేపట్టారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ రవి చనిపోయిన నాటి నుంచి ఆయన ఆశయ సాధన కోసమే పని చేస్తున్నామని చెప్పారు. అయితే, గత ఏడాది రవిఘాట్ వద్ద తనయుడు శ్రీరాంను గెలిపిస్తానని మాట ఇచ్చానని కానీ, అది ఒక్కటీ నెరవేర్చలేకపోయానన్న బాధ అలాగే ఉండిపోయిందని ఆవేదన చెందారు. రానున్న రోజుల్లో రాప్తాడు, ధర్మవరంతో పాటు అన్ని ప్రాంతాలను సమానంగా చూసుకుంటూ ముందుకెళ్తామన్నారు. రవి చనిపోయిన ఇన్నేళ్లు అయినా అభిమానులు చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ మరవలేమని చెప్పారు. వారి రుణం తీర్చుకుంటూ రవి ఆశయ సాధనకు పనిచేస్తామని పేర్కొన్నారు. పరిటాల రవి వర్ధంతి సందర్భంగా వెంకటాపురంకు వచ్చిన పలువురు టీడీపీ నాయకులతో సునీత కాసేపు మాట్లాడారు.













