Drugs Container : కంచికి చేరిన విశాఖ డ్రగ్స్ కంటెయినర్ కథ..!
ఆంధ్రప్రదేశ్ (AP) లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు ఓ సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఏడాది మార్చిలో విశాఖ పోర్టుకు (Vizag Port) వచ్చిన ఓ కంటెయినర్ (Container) ను సీబీఐ (CBI) సీజ్ (seize) చేసింది. ఈ కంటెయినర్ లో డ్రగ్స్ (drugs) ఉన్నట్టు తమకు సమాచారం అందిందని.. అందుకే దీన్ని సీజ్ చేశామని సీబీఐ వెల్లడించింది. దీంతో ఇది వైసీపీ (YCP) ప్రభుత్వ పనేనని విపక్షాలు ఆరోపించారు. అయితే దీంతో తమకు సంబంధం లేదని.. దీని వెనుక టీడీపీ (TDP) వ్యక్తులే ఉన్నారని వైసీపీ తిప్పికొట్టింది. అయితే నెలలు గడుస్తున్నా ఈ కంటెయిన్ విషయం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఈ కంటెయినర్ లో డ్రగ్స్ లేవని సీబీఐ క్లారిటీ ఇచ్చింది.
కొన్ని సంఘటనలు ఒక్కసారిగా జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. దాని ఆధారంగా నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఒక డెసిషన్ కు వచ్చేస్తుంటాం. విశాఖ డ్రగ్స్ కంటెయినర్ వ్యవహారం కూడా అలాంటిదే. జగన్ అధికారం ఉన్న సమయమది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రచారం కూడా ఉవ్వెత్తున సాగుతోంది. అప్పటికే వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా రాష్ట్రంలో పెరిగిపోయిందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి సమయంలో విశాఖలో ఓ కంటెయిన్ లో డ్రగ్ ఉన్నట్టు అనుమానించి దాన్ని సీబీఐ సీజ్ చేయడం సంచలనం కలిగించింది. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి దీని వెనుక ఆ పార్టీ నేతలు ఉన్నారని టీడీపీ ఆరోపించింది.
దీనికి కారణాలు కూడా లేకపోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అంతకు కొద్దికాలం ముందే బ్రెజిల్ అధ్యక్షుడికి ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. ఓ సాధారణ ఎంపీ ఓ దేశాధ్యక్షుడిని విష్ చేయడం మామూలు విషయం కాదని.. డ్రగ్స్ దందాలో భాగంగానే ఇదంతా జరుగుతోందని టీడీపీ ఎత్తి చూపింది. అయితే వైసీపీ దీన్ని తిప్పికొట్టింది. ఆ కంటెయినర్ లో వచ్చింది డ్రై ఈస్ట్ మాత్రమేనని వివరించింది. అయినా టీడీపీ ఊరుకోలేదు. డ్రై ఈస్ట్ లో డ్రగ్స్ కలిపి సరఫరా చేస్తున్నారని ఆరోపించింది. సీబీఐ కూడా ప్రాథమిక పరీక్షల్లో డ్రగ్స్ ఉన్నట్టు తేలిందని వివరించింది.
అయితే వైసీపీ మాత్రం పదే పదే టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టింది. చివరకు దీని వెనుక టీడీపీ నేతలే ఉన్న్రని ఎదురుదాడి ప్రారంభించింది. అదే సమయంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్నేహితుడికి ఈ కంటెయినర్ కు సంబంధం ఉందని ఆరోపించింది. అంతేకాదు.. ఈ కంటెయినర్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బంధువులదేనని ప్రకటించింది. అయితే ఇంతలో ఎన్నికలు వచ్చాయి.. ఈ కంటెయినర్ వ్యవహారం కూడా మూలన పడింది. అయితే ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ కంటెయినర్ సంగతి ఏంటో వివరించాలంటూ సీబీఐకి ఓ లేఖ రాశారు.
ఇప్పుడు సీబీఐ ఈ కంటెయినర్ పై క్లారిటీ ఇచ్చింది. ఇందులో డ్రగ్స్ లేవని.. అందులో ఉన్నది డ్రై ఈస్ట్ మాత్రమేనని వివరించింది. అంతేకాక.. కంటెయినర్ ను కూడా విడుదల చేసినట్లు తెలిపింది. అయితే ఇందులో ఉన్నది డ్రగ్సా కాదా అని తేల్చడానికి దాదాపు ఎనిమిది నెలల సమయం తీసుకుంది సీబీఐ. డ్రగ్స్ ఉన్నాయో లేవో తేల్చడానికి వారం పది రోజుల సమయం సరిపోతుంది. ల్యాబ్ కు శాంపిల్స్ పరీక్షిస్తే వారం రోజుల్లోపే నివేదిక వస్తుంది. మరి సీబీఐ ఇంతకాలం ఎందుకు నాన్చింది.. కంటెయినర్ ను ఎందుకు తమ అదుపులో పెట్టుకుంది.. అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. మొత్తానికి ఈ కంటెయినర్ కథ ఇప్పుడు కంచికి చేరింది.













