లోకేష్ కృషితో శివ ఎడారి జీవితానికి విముక్తి..
బతుకుతెరువు కోసం కువైట్ కి వెళ్లి.. ఏజెంట్ చేతిలో మోసపోయి ఆఖరికి ఎడారిలో మేకలు, గొర్రెలు, పశువులను మేపుతూ వంటలు జీవితం గడుపుతున్న శివకు విముక్తి లభించింది. ఇతనికి సంబంధించిన వీడియో గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎడారిలో పలకరించడానికి ఎవరూ లేరని.. చుట్టుపక్కల కనీసం ఒక్క చెట్టు, కనీసం గడ్డి కూడా లేదంటూ అతను పెట్టిన వీడియో ఎందరినో కదిలించింది. యజమానులు కూడా ఎప్పుడో ఒకసారి వస్తారని.. తినడానికి తగినంత తిండి కూడా పెట్టడం లేదని అతను వీడియోలో బాధపడ్డాడు. ఇదే కొనసాగితే మరొక రెండు రోజుల్లో తాను చనిపోతానని ఆవేదన వ్యక్తం చేస్తూ అతను సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియోను పెట్టాడు.
వైఎస్సార్ జిల్లా రాయచోటి ఏజెంట్ హైదర్, శివ ను కువైట్ కు పంపించాడు. అయితే అక్కడ జనసంచారం లేని ఎడారిలో పశువులను కాసుకుంటూ బతికే పని అతనికి అప్పగించారు. శివ తన పరిస్థితి హైదర్ కు వివరించగా.. అస్సలు కుదరదు నువ్వు అక్కడే పని చేయాలి అని కచ్చితంగా తేల్చి చెప్పాడు. చేసేది లేక అక్కడే కాలం గడుపుతున్న శివకు కనుచూపు మేరలో జనం లేకపోవడం తో ఒంటరితనం ఎక్కువైపోయింది. దీంతో అతని మానసిక స్థితి కూడా పూర్తిగా దెబ్బతింది. చేసేది లేక చివరి ప్రయత్నం గా అతని తన గోడు వినిపిస్తూ ఓ సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ నేపథ్యంలో శివను కాపాడవలసిందిగా అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి లో నివసిస్తున్న అతడి భార్య, కుమార్తెలు చేసిన విజ్ఞప్తికి నారా లోకేష్ స్పందించారు. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ తో మాట్లాడి.. శివ ను రక్షించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కువైట్ లో ఉన్న టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని కూడా లోకేష్ అప్రమత్తం చేశారు. శివ ను ఎడారి నుంచి సురక్షితంగా తరలించి భారత రాయబార కార్యాలయానికి తీసుకువచ్చారు. అతని తిరిగి ఇండియా పంపేటంతవరకు ఉండడానికి రూమ్, వసతి, భోజన సదుపాయాలని కూడా కల్పించారు. ఎడారిలో తాను గడుపుతున్న దుర్భరమైన జీవితం నుంచి బయటపడడంతో శివ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అతని త్వరలోనే ఇండియాకు తీసుకువచ్చి అతని కుటుంబంతో కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.













