Nara Lokesh: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ అందించిన లోకేష్..
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తాజాగా ఒక శుభవార్త అందించారు. ఇన్నాళ్లూ యాప్‌ల భారం మోస్తూ వచ్చిన వారు ఇప్పుడు ఊపిరి పీల్చుకోనున్నారు. వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు గవర్నమెంట్ టీచర్లకు చదువుపై కన్నా, యాప్‌ల నమోదుపై ఎక్కువ సమయం ఖర్చవుతూ వచ్చింది. అనేక యాప్‌లు ఉపయోగించాల్సి రావడం వల్ల ఉపాధ్యాయులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే సమస్యను గుర్తించి, కొత్త ప్రభుత్వం అందుకు పరిష్కారంగా ఓ సమగ్ర యాప్‌ను తీసుకువచ్చింది. దీనివల్ల ఉపాధ్యాయులకు పని తేలికవుతుంది, వాటి వల్ల ఏర్పడే ఒత్తిడి తగ్గుతుంది.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో “లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్” (Learning Excellence in Andhra Pradesh )అనే యాప్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. దీన్ని సంక్షిప్తంగా లీప్ (LEAP) అంటున్నారు. ఈ యాప్‌లో స్కూల్, టీచర్, విద్యార్థి, పరిపాలన, సమాచార మార్పిడికి సంబంధించి అన్ని అంశాలను కలిపి ఉంచారు. ఉపాధ్యాయులు ఒకే యాప్ ద్వారా అవసరమైన వివరాలను నమోదు చేయవచ్చు. ఫేస్ రికగ్నిషన్ ఐడి మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యే సదుపాయాన్ని అందించారు. ఇది పూర్తిగా వినియోగదారుల సౌలభ్యం దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది.
ఈ నేపథ్యంలో ఎందరో ఉపాధ్యాయులు గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులపై ఎన్నో యాప్‌లు భారం వేసినట్టు గుర్తు చేస్తున్నారు వారు. హాజరు, మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల నిర్వహణ, పాఠ్యపుస్తకాల పంపిణీ, నాడు-నేడు(Nadu Nedu) , పీఎం శ్రీ వంటి అనేక అంశాల కోసం వేర్వేరు యాప్‌లు ఉండేవి. వాటి ఉపయోగంలో సాంకేతిక సమస్యలు, పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవడం, లాగిన్ సమస్యలు నిత్యం ఇబ్బందికి గురి చేసేవి. ఉపాధ్యాయులు విద్యా బోధన కన్నా, ఈ యాప్‌లపై సమయం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.
అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం చూపింది. లీప్ యాప్ రూపంలో ఒకే వేదికపై అన్ని సేవలు అందుబాటులోకి రావడం ఉపాధ్యాయులను ఆనందంలో ముంచెత్తింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సానుకూల నిర్ణయాలతో ఉపాధ్యాయ వర్గాల్లో విశ్వాసం పెరుగుతోంది. ఇప్పటికే లీప్ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించిన ఉపాధ్యాయులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయుల నియామకాల్లో కూడా త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. డీఎస్సీ (DSC) ప్రక్రియను త్వరగా ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు ఇది మేలు చేస్తుంది. మొత్తం మీద, ఉపాధ్యాయులకు భరోసానిచ్చే దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో, వారు ఇప్పుడు ఒక కొత్త ఆశతో ముందుకు సాగుతున్నారు.













