తాత, తండ్రికి చెడ్డ పేరు తీసుకురాను
తన తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు అంత పేరు తెచ్చుకుంటానో లేదో కానీ వారికి చెడ్డ పేరు మాత్రం తీసుకురానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు సభలో ఎన్టీఆర్ మనవడి అవినీతి అంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణకు జనసేన అధినేత పేరు ప్రస్తావించకుండానే ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లయిన సందర్భంగా ప్రవేశపెట్టిన అభినందన తీర్మానంపై జరిగిన చర్చలో లోకేష్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కుటుంబం కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని భావించే చంద్రబాబు తనకు రోల్ మోడల్ అని చెప్పారు. హుద్‌హుద్ తుఫాను సమయంలో బ్రాహ్మణి సీమంతానికి వచ్చిన చంద్రబాబు కేవలం 5 నిమిషాలే ఉండి, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్లో మాట్లాడుతూ వెళ్లిపోయారని గుర్తు చేసుకున్నారు. అలిపిరి దాడి సమయంలో తామెంతో ఆందోళన చెందుతుంటే ఆయన ఫోన్ చేసి దైర్యం చెప్పారన్నారు. రాజకీయంగా చంద్రబాబుది 40 ఏళ్ల ప్రస్థానం అయితే, ఆయనతో తనది 30 ఏళ్ల అనుబంధమన్నారు. ప్రజాసేవ లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబు విజయానికి తన తల్లి భువనేశ్వరి సహకారం కీలకమైందని చెప్పారు.













